కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు టీడీపీ ఎంపీ సీఎం రమేష్ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. తొలుత ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రమే సహాయం చేస్తుందని ప్రకటించిన బీజేపీ, తెలుగుదేశం బయటకి వచ్చిన నాటి నుండి పలు పనులకి అడ్డు పడుతూ వస్తోంది. దీంతో ఇక నాలుగేళ్ళు ఎలాగూ వెయిట్ చేసామని ఇప్పుడు కూడా ఏమీ చేయకపోతే ఉక్కు పరిశ్రమ రాదని భావించిన కడప తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ఆమరణ దీక్ష ప్రారంభించారు. అయితే ఇలాంటి సమయంలో రాష్ట్రానికి అండగా ఉండాల్సిన పవన్ కళ్యాణ్ వంటి స్థాయి వ్యక్తి తన సహజ స్టైల్ లోనే టీడీపీపై మరోమారు విరుచుకుపడ్డారు. `రాష్ట్రం లో ఉన్న ప్రభుత్వం ప్రజలకి అండగా నిలవాల్సిన ప్రభుత్వలు ప్రజలను మోసం చెయ్యటం వ్యక్తిగతంగా నాకు చాలా బాధ కలిగింది. రాష్ట్ర విభజన తరువాత ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ప్రజలను రకరకాలుగా పీడించి దోచుకుంటుంది రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు వస్తాయని నేను ఊహించలేదు` అని వ్యాఖ్యానించారు.
ఉక్కు ఫ్యాక్టరీని ఒకప్పుడు అడ్డుకున్న టీడీపీ ఇప్పుడు దాని కోసం గోలగోల చేస్తోందని, రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయని భావించానని, గత ఎన్నికల్లో టీడీపీకి అందుకే మద్దతు ఇచ్చానని తెలిపారు. అయితే, హామీలు నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం విఫలం కావడంతో బయటకు వచ్చానన్నారు. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగి, యువతలో అశాంతి నెలకొంటుందని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమల స్థాపన కోసం ముందుకు వచ్చే వారిని కమీషన్లు అడుగుతున్నట్టు విదేశాల్లో కొందరు తనతో చెప్పారని అన్నారు. ఉక్కు పరిశ్రమ కోసం ఈ నెల 29న చేపట్టనున్న రాష్ట్ర బంద్‌కు జనసేన మద్దతు ఇస్తుందని పవన్ ప్రకటించారు. వామపక్షాలదీ తమదీ ఒకే భావజాలమని, సెప్టెంబరులో జనసేన, వామపక్షాలు, లోక్‌సత్తా పార్టీలు కలిసి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తాయని తెలిపారు. కాగా, ఆదివారం పవన్‌తో సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సమావేశమయ్యారు.