కొత్త రకం రాజకీయాలు చేస్తా అని పదేపదే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమలు విషయానికి వచ్చేసరికి బోల్తా కొట్టేస్తున్నారు. పాత చింతకాయ పచ్చడి రాజకీయాలకే మొగ్గు చూపుతున్నారు. ఇందుకు ఉదాహరణలు చెప్పాలంటే బోలెడు. తాజాగా కులం విషయాన్నే తీసుకుందాం. సీఎం చంద్రబాబు , ప్రతిపక్ష నేత జగన్ సమాజాన్ని కులాల వారీగా చీల్చే రాజకీయాలు చేస్తున్నారని చెబుతున్న పవన్ తాను మాత్రం కులాల్ని ఏకం చేసే రాజకీయాలు చేస్తా అని ప్రకటనలు ఇస్తున్నారు. అందుకు తగ్గట్టు ఏదైనా భారీ కార్యక్రమం నిర్వహిస్తారు అని ఎదురు చూస్తుంటే ఫక్తు కమర్షియల్ సినిమా తరహాలో ఆయన కుల సభలు నిర్వహిస్తున్నారు.
జనసేన మీద కాపు ముద్ర చెరిపేయడానికి పవన్ మిగిలిన వర్గాలని కలవడం తప్పులేదు. అయితే ముందుగా బీసీలతో భేటీ అయ్యారు. కాపు రిజర్వేషన్ అంశం మీద ఏ క్లారిటీ ఇవ్వకుండా రొటీన్ గా ప్రసంగం కానిచ్చారు. బ్రాహ్మణులతో భేటీలో కూడా ఇదే వ్యవహారం. ఇక ఇప్పుడు తాజాగా క్షత్రియులతో కూడా సమావేశం అయ్యారు. Aa కులాన్ని కాసేపు పొగిడి ఆ వర్గానికి చెందిన అశోకగజపతి రాజు విధివిధానాల మీదే తన విమర్శలు అని వివరణలు ఇచ్చారు. ఈ వ్యవహారం ఎన్నికల ముందు వైసీపీ , టీడీపీ పెట్టిన కుల సభల రీతిలోనే సాగుతోంది తప్ప కించిత్ కూడా తేడా లేదు. ఒకే పని చేస్తున్న ఆ రెండు పార్టీలు చేస్తున్నది కుల రాజకీయం అయితే ఇప్పుడు పవన్ సభల్ని కూడా అలాగే అనుకోవాల్సి వస్తుంది. అలా కాదు తాను భిన్నం అని చెప్పుకోవాలంటే అది మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలి. కుల దురభిమానం తగదని అన్ని కులాలకు పిలుపు ఇవ్వాలి. అన్ని వర్గాలు కలిసిమెలిసి ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాలి. ఆ పని కి బదులు ఒక్కో కులంతో విడివిడి భేటీలు కొద్దిపాటి పొగడ్తలతో మార్పు రాదు. చంద్రబాబు , జగన్ చేస్తున్న పనే తాను చేస్తూ అందుకు భిన్నమైన ఫలితాలు ఆశించడం అంటే నేతి బీరకాయలో నేతిని వెదికినట్టే.