రహస్య వ్యక్తుల భుజాలపై పవన్ తుపాకీ… పేలుతుందా ?

Pawan Kalyan False allegations on Chandrababu

ఎపిసోడ్ 1.

పవన్ కళ్యాణ్ …”లోకేష్ పెద్ద అవినీతి పరుడు “
జర్నలిస్ట్ …” లోకేష్ అవినీతికి ఆధారాలు ఉన్నాయా “
పవన్ కళ్యాణ్ …” ఎవరో అనుకుంటుంటే విన్నాను”

ఎపిసోడ్ 2 .

పవన్ కళ్యాణ్ … ” తిరుమల తిరుపతి దేవస్థానం లో అక్రమాల గురించి విచారణ జరపాలి. పింక్ డైమండ్ గురించి తేల్చాలి”
ప్రశ్న… వీటి గురించి ఎవరు చెప్పారు ?
పవన్ కళ్యాణ్… ఎయిర్ పోర్ట్ లో ఎదురైన ఓ సీనియర్ ips అధికారి చెప్పారు.
ప్రశ్న… ఎవరా పోలీస్ అధికారి ?
పవన్ కళ్యాణ్… మౌనం.

ఎపిసోడ్ 3 .

పవన్ కళ్యాణ్… ఏపీ లో పరిశ్రమలు పెట్టాలని వస్తున్నవారికి అవినీతి వల్ల ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి.
ప్రశ్న… మీకు ఎవరు చెప్పారు ?
పవన్ కళ్యాణ్… నాకు ఓ పారిశ్రామికవేత్త చెప్పారు.
ప్రశ్న… ఎవరు ఆ పారిశ్రామిక వేత్త?
పవన్ కళ్యాణ్… మౌనం .

ఈ మూడు ఎపిసోడ్లు చూసిన వారికి ఎవరికైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ఆరోపణల లోతు ఎంత వుందో అర్ధం అవుతుంది. పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తూ చిన్న చిన్న ఆధారాలు కూడా చూపకుండా బయట ప్రపంచానికి తెలియని వారి భుజాల మీద తుపాకులు పెట్టి కాల్చినంత మాత్రాన ప్రయోజనం ఉంటుందా ?. “పైగా అవినీతికి రెసిప్ట్ లు ఉంటాయా “ అని ప్రశ్నించినంత మాత్రాన నిర్దిష్టమైన ఆధారాలు లేకుండా ఏదో ఒకటి చెప్పేస్తే సరిపోతుందా ?

నిజంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ సభలకి మాత్రమే ఎదురు ఖర్చు పెట్టే పనిలేకుండా జనం వస్తున్నారు. అయితే పవన్ ప్రసంగాలు మాత్రం ఆ స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నాయి. దీనికి కారణం ప్రసంగాల్లో ఎత్తుకుంటున్న విషయం మీద సాధికారిత లేకుండా జనరల్ గా మాట్లాడ్డం, రచ్చబండ దగ్గర మాట్లాడుకున్నట్టు ఆరోపణలు, విమర్శలు చేయడం. ఈ పరిణామాలతో ఉత్తరాంధ్ర టూర్ లో జనం అయితే వచ్చారు గానీ రాజకీయ ప్రభావం మాత్రం చూపలేకపోయారు పవన్. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని మున్ముందు రాజకీయ యాత్రల్లో అయినా పవన్ ధోరణి మార్చుకుంటే మంచిది.