Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కొన్ని నెలల పాటు టీవీ చానళ్లలోనూ, సోషల్ మీడియాలోనూ తీవ్ర సంచలనంగా మారి… టాలీవుడ్ లోనూ ప్రకంపనలు రేపిన పవన్ కళ్యాణ్-కత్తి మహేశ్ వివాదం నాటకీయ రీతిలో ముగిసింది. జనసేనాని ప్రజాయాత్రకు కేవలం కొన్నిరోజుల ముందు ముగిసిన వివాదంపై అనేక సందేహాలు తలెత్తాయి. పెద్ద ఎత్తున డబ్బు చేతులుమారిందన్న ఆరోపణలు వినిపించాయి. పవన్ -కత్తి మహేశ్ వివాదంలో ఒక దశలో అత్యంత చర్చనీయాంశంగా మారిన నటి పూనమ్ కౌర్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని పరోక్షంగా వ్యక్తం చేస్తూ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు… మీ అస్తిత్వం ఏమిటి? అవసరాల కోసం మారిపోయిన నిజాయితీ.. నీ గుణం ఏంటి అని ట్విట్టర్ వేదికగా ఆమె ఘాటుగా ప్రశ్నాస్త్రాలు సంధించారు.
ఈ ట్వీట్ తర్వాత ఒకప్పడు కత్తి మహేశ్ ఎదురైన అనుభవమే పూనమ్ ఎదుర్కొంటున్నారు. ఆమె ట్వీట్ చూసిన పవన్ ఫ్యాన్స్ నిప్పులు చెరుగుతున్నారు. పబ్లిసిటీ కోసం ట్వీట్లు చేస్తున్నావా..? అని పూనమ్ పై మండిపడుతున్నారు. ఆమె వ్యాఖ్యలు పవన్ ను ఉద్దేశించి చేసినవే అని ఆరోపిస్తూ తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. సినిమాల గురించి ట్వీట్లు చేస్తే బాగుంటుందని, నాటకాలు చేస్తే తగిన శాస్తి చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరికొందరు పూనమ్ కూడా టీవీ చానల్స్ చర్చా కార్యక్రమాలకు వెళ్లాలని సెటైర్లు వేస్తున్నారు. అటు తన ట్వీట్ తీవ్ర దుమారం రేపడంతో పూనమ్ స్పందించారు. ఈ ట్వీట్ ఎవరినీ ఉద్దేశించింది కాదని, డబ్బు కోసం ఓ తండ్రి కూతురిని అమ్ముకుంటే… ఆమె ఆవేదనను తాను ట్వీట్ చేశానని పూనమ్ వివరణ ఇచ్చారు.