Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయ రంగ ప్రవేశం ముందు చేసినప్పటికీ సినిమాల్లో సీనియర్ అయిన రజని బాటలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నడుస్తున్నట్టుంది. కొత్త పార్టీ పెడతానంటూ ప్రకటించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆధ్యాత్మిక రాజకీయం అని సంచలనం రేపాడు. ఇక పార్టీ గుర్తు కూడా క్రియా యోగ లోని ఓ ముద్ర అని ప్రచారం జరిగింది. అదే గుర్తు కూడా రజనికి సంబంధించిన పోస్టర్స్, ఫ్లెక్షీల్లో దర్శనం ఇస్తోంది. దీంతో రజని బీజేపీ అనుకూల రాజకీయం చేయబోతున్నాడని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దాని కారణంగానే రజని పార్టీ ముద్ర అనుకున్న యోగ ముద్ర కింద తామర పువ్వు అదృశ్యం అయిపోయింది.
ఇప్పుడు పవన్ కూడా రజని బాటలోనే నడుస్తున్నారని చెప్పడానికి కారణం లేకపోలేదు. తనకు రాజకీయ లక్ష్యాలు తప్ప ఇతరత్రా సెంటిమెంట్స్ పెద్దగా లేవని చెప్పుకునే పవన్ రాజకీయ యాత్ర ప్రారంభం కోసం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఎంచుకోవడం, హిందువులు మంచిదిగా భావించే వసంత పంచమి రోజున రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టడం, నాడు హిందూ రాజులు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఇచ్చినట్టు పవన్ భార్య లెజినోవా హారతులు ఇవ్వడం, వీరతిలకం దిద్దడం వంటివి చూస్తుంటే ఈ డౌట్ బలపడుతోంది. రజని దారిలోనే పవన్ కూడా సెంటిమెంట్స్ ఫాలో కావడమే కాకుండా ఓ మత విశ్వాసాలకు అనుగుణంగా తొలి అడుగులు వేసినట్టు కనిపిస్తోంది. ఈ వ్యవహారం మున్ముందు మిగిలిన వర్గాల నుంచి విమర్శలకు అవకాశం ఇచ్చేలా వుంది.