Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనసేన ఆవిర్భావ సభలో టీడీపీ సర్కార్, సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్ కి అంతలోనే ఏదో అయ్యింది. విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఓ టీవీ ఛానల్ లో ఇంటర్వ్యూ సందర్భంగా పవన్ బాడీ లాంగ్వేజ్ చూస్తే ఆయన ఫాన్స్ కూడా ఈయనేనా పవర్ స్టార్ అని సందేహపడే పరిస్థితి. 24 /7 న్యూస్ ఛానల్ లో కూర్చుని యాంకర్ వెంకట కృష్ణ అడిగే ఏ ప్రశ్నకు కూడా పవన్ సూటిగా, నిర్భయంగా, ఆత్మవిశ్వాసంతో సమాధానం ఇచ్చినట్టు లేదు. పైగా ఇంతటి సమస్యకు కారణం అయిన లోకేష్ తో శేఖర్ రెడ్డి కి సంబంధాల మీద వున్న ఆరోపణల విషయంలో కూడా పవన్ జారిపోయారు. ఆ ఆరోపణలకు కట్టుబడినట్టు చెప్పకపోగా ఎవరో అనుకుంటున్న విషయం ప్రస్తావించినట్టు మాట దాటేసారు. ఈ ఒక్క ఇంటర్వ్యూ చూస్తే పవన్ కి రాజకీయంగా వున్న పరిమితులు ఏమిటో అర్ధం అవుతాయి.
పవన్ బలహీనత ని ఎత్తి చూపుతూ కత్తి మహేష్ చేసిన ట్వీట్ కి ఏ సమాధానం ఇవ్వాలో తెలియక పవర్ స్టార్ ఫాన్స్ కూడా అయోమయంలో పడ్డారు. అసలు రాజకీయంగా పవన్ వైఖరి ఎందుకు మారింది? అందుకు కారణాలు ఏంటో చెప్పకుండా ఒక్కసారిగా యూ టర్న్ తీసుకునేసరికి దాన్ని ఎలా సమర్ధించుకోవాలో పవన్ ఫాన్స్ కి కూడా అర్ధం కావడం లేదు. స్వయంగా పవన్ కూడా సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఫాన్స్ నుంచి అంతకు మించి ఆశించడం తప్పే. ఈ పరిణామాలు దగ్గరగా గమనిస్తున్న ఓ జనసేన నాయకుడు పక్కకి వచ్చి మా పవన్ కి స్క్రిప్ట్ , డైరక్షన్ లేకుండా డైలాగ్ చెప్పడం రాదని తేల్చేశారు.