పవన్ యాత్ర కోసం లగ్జరీ బస్సు… సదుపాయాలివే

Pawan Kalyan Janasena Party Bus yatra schedule in AP

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలోకి దిగేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ స్థాపించి నాలుగేళ్లు గడుస్తున్నా జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఎప్పుడూ పర్యటించలేదు. అడపాదడపా శ్రీకాకుళం, అనంతపురం, కరీంనగర్ లలో నాలుగైదు రోజులు పర్యటించిన పవన్ పూర్తి స్థాయి యాత్ర చేయనున్నట్టు తెలుస్తోంది. అజ్ఞాతవాసి సినిమా తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి సారించిన పవన్ ఇప్పుడు ఎన్నికలలో అన్ని స్థానాలలో పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. జిల్లాల వారీగా ఏపీ మొత్తం పర్యటిస్తానని పవన్ ప్రకటించీనా తన మీద కుట్రలు జరుగుతున్నాయని అందుకే పర్యటనని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడు.

అయితే ముందు అనుకున్నట్టుగానే జిల్లాల పర్యటనకు సన్నాహాలు చేస్తున్నారు జనసేన వర్గాలు. అందుకోసం ప్రత్యేకంగా ఓ బస్సును ఏర్పాటు చేసుకుంటున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సకల సదుపాయాలు సౌకర్యాలు ఉండేలా ఆ బస్సును హైదరాబాద్ కు చెందిన ఓ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ రీమోడల్ చేస్తోందని తెలుస్తోంది. రెస్ట్ రూమ్ సహా చిన్న సైజు మీటింగ్ క్యాబిన్, లోపల నుంచి బస్సు టాప్ పైకి చేరుకునేలాగా నిచ్చెన ఉండే విధంగా ప్రత్యేక బస్సును రీమోడల్ చేయిస్తున్నారట. కొద్దిరోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ లను పవన్ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో కూడా టీడీపీ నేతల అవినీతిని దుయ్యబట్టడమే ఎజెండాగా ఉండవచ్చని తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలనూ కలుపుకుంటూ యాత్ర సాగనుంది. యాత్ర పేరు, ప్రారంభ తేదీ, ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుందనేదీ ఒకట్రెండు రోజుల్లో ఖరారు చేయనున్నారని, యాత్రకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌పై కసరత్తు కూడా కొలిక్కి వచ్చినట్లు జనసేన వర్గాల సమాచారం. యాత్రలో భాగంగా స్థానిక సమస్యలను గుర్తించడంతోపాటు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా ఈ యాత్ర చేపడుతున్నట్టు తెలుస్తోంది. అలాగే, సమస్యలను గుర్తించిన తర్వాత వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై తీసుకొచ్చే ఒత్తిడితోపాటు, ఆ విషయంలో తమ పార్టీ విధానం ఏంటనేది అక్కడికక్కడే ప్రకటిస్తారని సమాచారం. ఇందుకోసం రెండు స్కార్ఫియోలు కొనుగోలు చేశారని అంటున్నారు. మొత్తం ఆయన పర్యటనలో అధికారికంగా 10కి పైగానే వాహనాలుంటాయని అంటున్నారు. ఆయన తన పర్యటనకు సంబంధించి రాష్ట్ర డీజీపీకి, ఇతర ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు సమాచారం.