Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం త్వరలో పాదయాత్ర చేపట్టాలని తలపోస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ నిర్మాణ పనులు చురుగ్గా సాగిస్తున్న పవన్ ఇక దాన్ని బలోపేతం చేసే పనుల మీద కూడా దృష్టి పెడుతున్నారు. ఇప్పటిదాకా బస్సు యాత్ర చేయాలా లేక పాదయాత్ర చేయాలా అన్న ద్వైదీభావము లో వున్న పవన్ లండన్ నుంచి వచ్చాక పార్టీ ముఖ్యులు,సన్నిహితులతో చర్చించాక పాదయాత్ర అయితే జనసేన మైలేజ్ పెరుగుతుందని ఓ నిర్ణయానికి వచ్చారట. అయితే దీనికి సంబంధించి ప్రకటన చేసే ముందే పాదయాత్ర రూట్ మ్యాప్, అజెండా మీద కూడా విస్తృతంగా చర్చిస్తున్నారు.
పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారు చేసే పనిని పార్టీలోని ఓ బృందానికి అప్పగించినట్టు తెలుస్తోంది. ఇక పాదయాత్ర ఎలా చేయాలి , అందులో ఏమి మాట్లాడాలి అన్న అంశం మీద కూడా లోతైన కసరత్తు చేస్తున్నారు. జగన్ తరహాలో అన్ని అంశాల మీద మాట్లాడుతూ స్థానిక సమస్యలను ప్రస్తావించడమా లేక ఇంకేదైనా అజెండా పెట్టుకుంటే బాగుంటుందా అన్న కోణంలో ఆలోచించారు. చివరగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అన్న లక్ష్యంతో పాదయాత్ర జరిపితే బాగుంటుందని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. హోదా అంశాన్ని లేవనెత్తడం ద్వారా బీజేపీ తో అధికారం పంచుకున్న టీడీపీ ని , కేసుల నుంచి రక్షణ కోసం కమలం వెంటపడుతున్న వైసీపీ ని ఒకేసారి టార్గెట్ చేయడానికి అవకాశం ఉంటుందని జనసేన వ్యూహకర్తలు భావిస్తున్నారు. ఈ రెండు పార్టీలను ఇరుకున పెడుతూ బీజేపీ ని టార్గెట్ చేస్తూ పవన్ పాదయాత్ర ముందుకు సాగే అవకాశం వుంది.