Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు రాజకీయ చాణక్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. శత్రువు చేత కూడా పొగిడించుకునే సామర్ధ్యం ఆయన సొంతం. ఒక్కసారి పొగిడాక ఆయన్ని ఎలా తిట్టాలో కూడా ఆ శత్రువుకి అర్ధం కాదు. జరిగిన నష్టాన్ని అర్ధం చేసుకుని విమర్శించడం మొదలెట్టినా జనం నమ్మరు. ఇప్పుడు ఇదంతా ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వచ్చిందంటే జనవరి 1 న ప్రగతి భవన్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యక్షం కావడం, అసాధ్యాల్ని సుసాధ్యం చేస్తున్నారంటూ ఆయన కెసిఆర్ మీద పొగడ్తల వర్షం కురిపించడం చూసి ఆశ్చర్యం కలిగించింది. చూసేవాళ్ళకి ఆశ్చర్యం ఏమో గానీ ఇలాంటివి కెసిఆర్ కి కొత్త కాదు. కావాలంటే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళండి.
తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో 100 ఏళ్ళ చరిత్ర వున్న కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి మొదలుకుని జాక్ చైర్మన్ కోదండరాం దాకా అంతా కెసిఆర్ తో భేటీ అయ్యారు. ఉద్యమంలో అన్ని పార్టీలు ఉన్నప్పటికీ కెసిఆర్ నే ఉద్యమ నేతగా ఫీల్ అయ్యి గౌరవం ఇచ్చేవాళ్ళు. ఇక అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని సొంత పార్టీ కాంగ్రెస్ నేతలే విమర్శలతో ఉతికి ఆరేసేవారు. ఓ పక్క పక్క పార్టీ నేత కెసిఆర్ ని పొగడడం, సొంత పార్టీ నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డిని తిట్టడం ఏంటా అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆలోచించలేదు. కెసిఆర్ ఏదో మంత్రం వేసినట్టు ఆయన ఏది చెబితే అది చేసుకుంటూ పోయారు. అలా చేసినందుకే తెలంగాణ కల సాకారం చేసిన కాంగ్రెస్ కి ఎదురు దెబ్బ , కెసిఆర్ కి సీఎం పీఠం దక్కాయి. కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక గానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు కళ్ళు తెరవలేదు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు కెసిఆర్ మీద ఆ పార్టీ విమర్శల్ని జనమే లైట్ తీసుకుంటున్నారు.
ఇక తాజాగా కెసిఆర్ అసాధ్యాల్ని సుసాధ్యం చేస్తున్నారని ప్రశంసించిన పవన్ ఒకప్పుడు ఆయన్ని బద్ధశత్రువుగా పరిగణించినవారే. ఇద్దరి మధ్య మాటల తూటాలు బాగానే పేలాయి. కెసిఆర్ అయితే పవన్ ని ఎంత తక్కువ చేసి మాట్లాడాలో అంత తక్కువ చేసి మాట్లాడారు. ఇక ఈ మధ్య సయోధ్య అసాధ్యం అనిపించింది. కానీ సుసాధ్యం చేశారు కెసిఆర్. ఇటీవల రాష్ట్రపతి గౌరవార్ధం గవర్నర్ నరసింహన్ ఇచ్చిన విందులో కొద్దిసేపు కెసిఆర్, పవన్ మాట్లాడుకున్నారు. అప్పుడే అంతా ఆశ్చర్యపడ్డారు. అది జరిగిన వారం రోజులకే పవన్ ప్రగతి భవన్ కి వచ్చి మరీ తెలంగాణ రైతులకు 24 గంటల వ్యవసాయ విద్యుత్ అందిస్తున్న కెసిఆర్ మీద పొగడ్తలు కురిపించి భోజనం చేసి మరీ వెళ్లారు. ఇదంతా చూసిన వాళ్లకి పవన్ మీద కెసిఆర్ ఏ మంత్రం వేశాడో అర్ధం కాక జుట్టు పీక్కుంటున్నారు.