Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనసేన శ్రేణులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పవన్ రాజకీయ యాత్ర ముహూర్తం, పర్యటన రూట్ మ్యాప్ నేడు ఖరారు కానున్నాయి. ఆంధ్ర రాజకీయాల మీద ప్రధానంగా ఫోకస్ చేస్తున్న పవన్ రాజకీయ యాత్ర ప్రారంభం మాత్రం తెలంగాణ నుంచి ఎంచుకోవడం ఆశ్చర్యకరం. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుంచి తన రాజకీయ యాత్ర మొదలు పెడుతున్నట్టు పవన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ సాయంత్రం అదే ఆలయ ప్రాంగణం దగ్గర నుంచి రాజకీయ యాత్రకి సంబంధించిన వివరాలు వెల్లడించనున్నట్టు కూడా పవన్ తెలిపారు.
2009 లో ఎన్నికల ప్రచారం సందర్భంగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో జరిగిన ఓ ప్రమాదంలో ఆ స్వామే తనను కాపాడినట్టు చెప్పుకున్న పవన్ తమ కుటుంబ ఇలవేలుపు అయిన అదే స్వామి ఆలయం నుంచి రాజకీయ యాత్ర ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ యాత్ర కు “చెల్ చెలోరె చెల్ “ అని పేరు పెట్టే అవకాశం ఉందట. పవన్ రాజకీయ యాత్ర రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జరుగుతుంది. అయితే ప్రారంభ వేదికగా తెలంగాణను ఎంచుకోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ రాజకీయ యాత్ర పాదయాత్రగా ఉంటుందా లేక బస్సు యాత్రా అనేది కూడా నేటితో తేలిపోనుంది. పవన్ కి వున్న వెన్ను నొప్పి దృష్ట్యా పాదయాత్ర జరిపే అవకాశాలు తక్కువే.