Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయంలో ఏ పరిణామం ఎప్పుడు ఎలా దారి తీస్తుందో అంత తేలిగ్గా చెప్పలేం. వైసీపీ అధినేత జగన్ కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ అని ఎక్కువ మంది అనుకోలేదు. ఈ విషయంలో వైసీపీ శ్రేణులు, ఆ పార్టీ అధినేత జగన్ అందరి కంటే ముందుంటారు. అందుకే 2014 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు వెళ్ళినప్పుడు వైసీపీ నాయకులు ఆయన్ని చిన్నబుచ్చే ప్రకటనలు చాలా చేశారు. ఆ ఎన్నికల్లో పవన్ కొట్టిన దెబ్బ ఫలితాలు వచ్చాక కానీ అర్ధం కాలేదు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఆ తర్వాత కూడా పవన్ రాజకీయ వైఖరిని ప్రశ్నిస్తూ ఆయన్ని చంద్రబాబు చెంచాగా జనం దృష్టిలో నిలబెట్టడానికి వైసీపీ చేయని ప్రయత్నం లేదు. పైగా జగన్ తనకి పవన్ పోటీయే కాదనుకునే పరిస్థితి నుంచి ఇంకా బయటికి రాలేదు. అందుకే పవన్ ని విమర్శించే పని రోజా వంటి వారికి అప్పగించారు. తాను ఇప్పటికి ఒక్కసారి కూడా పవన్ పేరు ఎత్తి స్వయంగా ఒక్క విమర్శా చేయలేదు. అయితే తాను అనుకున్నంత చిన్న నాయకుడు పవన్ కాదని అర్ధం అయ్యే రోజు వచ్చింది.
నవంబర్ 2 నుంచి పాదయత్రకి వైసీపీ అధినేత జగన్ రెడీ అవుతున్నాడు. కాస్త అటుఇటుగా అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం పాదయాత్ర కి ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. ఇద్దరు యువనాయకులు ఒకే సారి ప్రజల్లోకి వెళితే సహజంగానే పోలికలు వస్తాయి. ఎవరికి జనం వస్తారు ? ఎవరికి ప్రజాస్పందన ఎక్కువగా వుంది అన్న దాని మీద చర్చ జరగక తప్పదు. అదే జరిగితే …ఈ సందేహం ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ ని తొలిచేస్తోంది. పవన్ కళ్యాణ్ కి వుండే సినీ క్రేజ్ తో సహజంగా ఆయనకి ఎక్కువగా జనం వచ్చే అవకాశం ఉంటుంది. పైగా పత్రికలు, మీడియా ఈ విషయాన్ని పదేపదే రిపోర్ట్ చేస్తాయి. ఈ పోలికల ముందు టీడీపీ ప్రభుత్వానికి , చంద్రబాబుకి వ్యతిరేకంగా తాను చేసే ప్రచారం జనం దృష్టిలో పడకుండా పోతుంది. ఇదే ఆలోచన ఇప్పుడు జగన్ ని సతమతం చేస్తోంది. ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే పవన్ మీద నేరుగా విమర్శల దాడి చేయడమే మేలని కొందరు సలహా ఇస్తున్నారట. అయితే కాపుల ఓట్ల కోసం ఓ వైపు ప్రయత్నిస్తూ ఇంకోవైపు పవన్ మీద విమర్శలు సరికాదని జగన్ అనుకుంటున్నారట. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా పవన్ ప్రత్యేక హోదా డిమాండ్ ముందుకు తెచ్చి మోడీ, చంద్రబాబు, జగన్ లని ఒకే తాటికి కట్టేస్తే ఎలా అన్న సందేహం కూడా జగన్ కి లేకపోలేదు. ఏదేమైనా పవన్ పోటీ యాత్ర అన్న ఆలోచన అనేకవిధాలుగా జగన్ ని ఇబ్బంది పెడుతోంది. ఒకప్పుడు ఈయన నాకు పోటీ కాదు అనుకున్న వ్యక్తే ఇలా పోటీ కి రావడం చూసి జగన్ ఇంకో చేదు అనుభవం ఎదురు అయ్యింది.