Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విశాఖపట్టణం పెందుర్తిలో జరిగిన దారుణంపై జనసేనాని తీవ్రంగా కలత చెందారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. పెందుర్తిలో ఓ దళిత మహిళను ఓ పార్టీ కార్యకర్తలు అందరిముందే చీర చింపి అవమానించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించారు. ఇవాళ మరో మారు బాధితురాలికి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు.
మహిళకు జరిగిన అవమానం గురించి విన్న తర్వాత తాను చాలా డిస్ట్రబ్ అయ్యానని పవన్ అన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై పోలీసులు, ప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, ఇది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపిస్తుందని పవన్ ట్వీట్ చేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రజలు వివరణకోరుతున్నారని, ప్రభుత్వం స్పందించకపోతే పరిస్థితులు దిగజారతాయని హెచ్చరించారు. గతంలో కారంచేడు, చుండూరు ఘటనల్లోనూ ఇలాగే జరిగిందని, ఇది చాలా సున్నితమైన వివాదమని, ప్రభుత్వం తగిన విధంగా స్పందించాలని పవన్ సూచించారు.
రోహిత్ వేముల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని, అందుకే ఇలాంటి ఘటనల్లో అధికారులు చూస్తూ ఉండిపోకూడదని పవన్ అన్నారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే… ఓ మహిళను నిస్సహాయురాలిని చేసి కొందరు దాడిచేశారని, ఆమె ఏ వర్గానికి చెందిన మహిళైనా..అక్కడ దాడికి కారణం ఏదైనా..అలా చేయడం మాత్రం న్యాయం కాదని పవన్ ఆవేదన వ్యక్తంచేశారు. తాను నేరుగా ఈ విషయంలో జోక్యం చేసుకుంటే అధికారులపై మరింత ఒత్తిడి పెరుగుతుందని, అలా జరగకుండా బాధిత మహిళకు న్యాయం జరిగేలా చూడాలని పవన్ హెచ్చరించారు. ప్రభుత్వం, అధికారులతో పాటు బాధిత మహిళతరపున కుల పెద్దలు కూడా ఈ వివాదంపై శాంతియుత పరిష్కారం చూపాలని కోరారు.
నిస్సహాయ మహిళకు విశాఖ జిల్లా కలెక్టర్, ఎస్పీ అండగా నిలబడాలన్నారు. రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత హక్కులకు ఏ ఒక్క వ్యక్తి కానీ, ఏ ఒక్క వర్గం కానీ భంగం కలిగిస్తే..అలాంటి వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వపన్ సూచించారు. అలా కాకుండా అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తే చట్టాన్ని ప్రజలు తమ చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. మీడియాకూ జనసేనాని కొన్ని సూచనలు చేశారు. ఇలాంటి ఘటనలను మీడియా సెన్సేషన్ చెయ్యకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పవన్ విజ్ఞప్తిచేశారు.