ఎన్నికల షెడ్యూల్ కూడా రావడంతో అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టోపై ఎన్నికల వ్యూహాలపై జనసేన పార్టీ దృష్టిపెట్టింది. అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితాను జనసేన సిద్ధం చేసింది. సోమవారం (11-03-2019) పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పార్టీ జనరల్ బాడీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసి 32 అసెంబ్లీ స్థానాలకు, 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఫైనల్ చేసినట్లు తెలిపారు. తొలి జాబితాను రెండు, మూడు రోజుల్లో విడుదల చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నామినేషన్ల పర్వం మరో వారంలో ప్రారంభంకానుండటంతో వీలైనంత త్వరగా అభ్యర్థుల్ని ఎంపిక చేసి ప్రచార బరిలోకి దిగేందుకు జనసేన కసరత్తు చేస్తోందని అంటున్నారు. 32 అసెంబ్లీ, 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసిన జనసన మిగిలిన స్థానాల్లో కూడా గెలుపు గుర్రాలను ఎంపిక చేసి జాబితాను సిద్ధం చేసే పనిలో ఉంది.
అలాగే వామపక్షాలతో పొత్తుల అంశంపై కూడా వీలైనంత త్వరగా క్లారిటీకి రావాలని చూస్తున్నారట ఇరు పార్టీల నేతలు. పార్టీలో సీనియర్లుగా ఉన్న మాదాసు గంగాధరం, శ్రీ అర్హం ఖాన్, మహేందర్ రెడ్డి, హరిప్రసాద్, శివశంకర్ వంటి నేతలతో కమిటీని ఏర్పాటు చేసిన పవన్ అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత కోసం సరికొత్త పంధాను ఎంచుకున్నారు. టికెట్ల కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చంటూ అందరికీ స్వేచ్ఛను ఇచ్చారు పవన్ కళ్యాణ్. చేశారు. ఈ కమిటీ విజయవాడ కార్యాలయంలో దరఖాస్తుల్ని స్వీకరించి నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల్ని ఎంపిక చేసే పనిలో ఉంది.