Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మీడియాపై పవన్ ట్విట్టర్ యుద్ధం కొనసాగుతోంది. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ, టీవీ 9 సీఈవో రవిప్రకాశ్ లక్ష్యంగా పవన్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. సోమవారం రాత్రి రాధాకృష్ణ ఫొటో పోస్ట్ చేసి భోజనంలో కాస్తంత సంస్కారాన్ని కూడా వడ్డించమని కుమారుడికి సలహా ఇచ్చి గుడ్ నైట్ చెప్పిన పవన్ ఉదయాన్నే మళ్లీ తన ట్వీట్లు కొనసాగించారు. రవిప్రకాశ్ కు గుడ్ మార్నింగ్ చెబుతూ ట్వీట్ల వర్షం మొదలుపెట్టారు. రవిప్రకాశ్ దంపతులు పూజలో ఉన్న ఫొటో పోస్ట్ చేసి నువ్వు దేవుడిని, పూజలను కూడా నమ్ముతావా అని ప్రశ్నించారు. ఆ తర్వాత…నీకు కొన్ని ఆర్టికల్స్ పంపిస్తున్నాను. వీటితో కూడా ఏమైనా షో చేయగలవా..? అని ఎద్దేవా చేశారు…తర్వాత రవిప్రకాశ్ కు బహిరంగ లేఖ పేరుతో కొన్ని ఆర్టికల్ క్లిప్పింగులు జత చేశారు. వీటి ఆధారంగా 9గంటల షో చేసి సమన్యాయం చేయాలని సూచించారు. తాము నోరుమూసుకుని ఉంటున్నందుకే తమపై విషం కక్కుతున్నారని ఆరోపించారు.
టీవీ 9 యజమాని శ్రీనిరాజ్ ను తాను ఏమీ అనలేదని, తన అభిప్రాయం మాత్రమే వ్యక్తపరిచానని సోమవారం చెప్పిన పవన్ ఇవాళ మాత్రం ఆయనపై విరుచుకు పడ్డారు. ఐఎస్ బీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థకు బోర్డు మెంబరుగా ఉన్న నీవు…నీ చానల్ లో మాత్రం అసభ్యకరమైన వార్తలు ప్రసారం చేస్తావా..? కాస్త గౌరవప్రదంగా నడుచుకోవడం నేర్చుకో అని సూచించారు. కాసేపటి తర్వాత పవన్ మరో సంచలన ట్వీట్ చేశారు. గత ఆరునెలలుగా తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై దర్యాప్తు జరపాల్సిందిగా…తెలంగాణ పోలీసులను కోరనున్నట్టు తెలిపారు. ఈ దెబ్బతో తనను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న పురుషులు, మహిళల జాతకాలు అన్నీ బయటకు వస్తాయని, అది క్రమంగా అమరావతి వైపు దారితీస్తుందంటూ సంచలన ట్వీట్ చేశారు. దర్యాప్తు జరిగితే ప్రముఖుల కుటుంబాలకు చెందిన వారి పేర్లు, రాజకీయనాయకులు, మీడియా పెద్దలు, వారి పిల్లలు అందరూ బయటకు వస్తారని, సమాజంలోని కుళ్లు కూడా బయటపడుతుందని వ్యాఖ్యానించారు. మీరందరూ కలిసి నడిరోడ్డుపై ఓ సోదరి బట్టలు ఇప్పించేలా..ప్రోత్సహిస్తే దాన్ని మీడియా చూపించింది. అన్ని షోలకు అది కారణమైంది అని పవన్ ట్వీట్ చేశారు…ఇలా వరుస ట్వీట్లతో ఏబీఎన్, టీవీ9పై విరుచుకు పడ్డ పవన్…కాసేపటి తర్వాత మాత్రం ప్రస్తుత పరిస్థితులపై నిర్వేదం వ్యక్తంచేస్తూ ఓ ట్వీట్ చేశారు. తానెప్పుడూ నిస్వరుడిని, నిస్సహాయుడినని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా మార్టిన్ నైమోలర్ కోట్ ను పోస్ట్ చేశారు. తొలుత వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు. కమ్యూనిస్టును కాదు కాబట్టి నేనేమీ మాట్లాడలేదు. తరువాత వారు సోషలిస్టుల కోసం వచ్చారు. సోషలిస్టును కాదు కాబట్టి నేను మాట్లాడలేదు. తదుపరి వారు వర్తక సంఘాల కోసం వచ్చారు. వర్తక సంఘాల వ్యక్తిని కాదు కాబట్టి నేనేమీ మాట్లాడలేదు. తర్వాత వారు యూదుల కోసం వచ్చారు. నేను యూదుడిని కాదు కాబట్టి మాట్లాడలేదు. ఆ పై వారు నాకోసం వచ్చారు. అప్పుడు మాట్లాడేందుకు ఎవరూ లేరు అన్న వ్యాఖ్యలున్న పోస్టర్ ను పవన్ పోస్ట్ చేశారు. పవన్ ఇప్పుడు చేసిన పోస్ట్ ఎప్పటినుంచో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా షేర్ అయ్యేదే…కష్టంలో ఉన్న తోటి వ్యక్తికి సాయం చేయడానికి మనం ముందుకు రాకపోతే..మనం కష్టాల్లో ఉంటే సాయపడేందుకు ఎవరూ ఉండరు అని అర్థం వచ్చే ఈ కోట్ ను జర్మన్ కు చెందిన రచయిత మార్టిన్ నైమోలర్ హిట్లర్ పాలనా కాలంలో రాశారు. నాజీల దుర్మార్గాలను ఉద్దేశించి రాసిన ఈ కోట్ రెండో ప్రపంచయుద్ధ కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. మీడియాపై యుద్ధం చేస్తున్న పవన్ ఈ పోస్ట్ పెట్టడం…తీవ్ర చర్చనీయాంశంగా మారింది.