పవన్ గారు …ఉండవల్లి ఆ రోల్ కి సరిపోతాడా ?

Pawan Kalyan Should Know Undavalli Can't Manage the Jack

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

విభజన సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆంధ్రప్రదేశ్ మీద అపార నిర్లక్ష్యం చూపిస్తున్న కేంద్రం మెడలు వంచే పోరాటం కోసం జాయింట్ ఆక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించడం బాగానే వుంది. అయితే దాన్ని నడిపేందుకు ఆయన లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ , మాజీ ఎంపీ ఉండవల్లి పేర్లు ముందుకు తేవడం చర్చకు దారి తీస్తోంది. జయప్రకాశ్ నారాయణ చిత్తశుద్ధి , అపార జ్ఞానం గురించి ఎవరికీ సందేహాలు లేవు. ఆయన పేరు మీద ఏ అభ్యంతరాలు లేవు. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేరు మీద అంతటి ఏకాభిప్రాయం లేదు. పైగా ఆయనే స్వయంగా నా గురించి ఎక్కువ వూహించుకోవద్దని పవన్ కి ఫోన్ లోనే చెప్పేసిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిజానికి ఉండవల్లి తెలివైనవాడు అని చెప్పడం లో ఎవరికీ సందేహం లేదు. వై.ఎస్ , కేవీపీ లకు సన్నిహితుడుగా వ్యవహరించిన ఉండవల్లి గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా తెలిసింది మార్గదర్శి ఎపిసోడ్ లోనే. మార్గదర్శి చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిందని ఉండవల్లి చేసిన పోరాటం రామోజీ వ్యతిరేకులకు తాత్కాలిక సంతోషం కలిగించింది. ఇక రామోజీకి సైతం తలనొప్పి తెప్పించింది. అయితే మార్గదర్శి చేసిన పనివల్ల ఏ సామాన్యుడు నష్టపోలేదు. ఉండవల్లి ఆ విధంగా ప్రజలకు నష్టం లేని విషయంలో పోరాటం చేసి ఏమి సాధించారో అందరికీ తెలుసు. ఇక ఉండవల్లి హైలైట్ అయిన రెండో అంశం రాష్ట్ర విభజన. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ టీవిలో చూసినా ఉండవల్లి. తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో రాదని బల్లగుద్దిన ఉండవల్లి మాటలు నమ్మి ఆంధ్రులు ఏ విధంగా నష్టపోయారో చూస్తున్న విషయమే.

ఇక విభజన తర్వాత చంద్రబాబు సర్కార్ కి వ్యతిరేకంగా వైసీపీ తరపున ఉండవల్లి పరోక్ష యుద్ధం చేస్తున్న విషయం చిన్నపిల్లవాడిని అడిగినా చెబుతాడు. పట్టిసీమతో గోదావరిజిల్లాకు నష్టం అని , కృష్ణా డెల్టాకు ఏ ప్రయోజనం ఉండబోదని ఉండవల్లి బహుగట్టిగా వాదించారు. నిజానికి పట్టిసీమ అనుకున్న సమయానికి పూర్తి కాకుండా ఉండి ఉంటే ఉండవల్లి చెప్పింది నిజమే అనుకోడానికి వీలుండేది. కానీ పట్టిసీమతో మూడేళ్ళుగా కలుగుతున్న లబ్ది చూసాక ఉండవల్లి గురించి ఓ విషయం చెప్పక తప్పదు. ఉండవల్లి నిజానికి మేధావి. అందులో సందేహం లేదు. అయితే తాను అనుకున్న విషయాన్ని జనానికి చేరవేయడానికి ఆ తెలివితేటలు , మాటకారితనం ఉపయోగపడతాయి గానీ ఆయన అనుకున్న విషయాలు నిజంగా ప్రజా సంక్షేమ కోరేవి అని చెప్పలేని పరిస్థితి. పై మూడు ఉదాహరణలు చూస్తే ఉండవల్లి ఓ తెలివైన రాజకీయ నాయకుడు మాత్రమే తప్ప ఇంకోటి కాదని అర్ధం అవుతుంది. అలాంటి ఉండవల్లికి జాక్ ని నడిపించే బాధ్యత అప్పగించాలి అనుకోవడం సరికాదని పవన్ గుర్తు ఎరగాలి. ఉండవల్లి ఆ రోల్ కి పనికిరాడని అర్ధం చేసుకోవాలి.