Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులను తప్పుబడుతూ.. వారి నుంచి శ్రీవారి సంపదను పరిరక్షించాలని ఆరోపిస్తున్న ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు బీజేపీ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నట్టే కనిపిస్తోంది. ఇటీవలే ఢిల్లీ వెళ్లి అమిత్ షా, హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో బెహ్టీ అయిన ఆయన ఇప్పుడు టీటీడీ వైఖరికి నిరసనగా ఆమరణ నిరాహార దీక్షకు దిగాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. తనపై ఎదురుదాడి చేస్తూ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూస్తోందని అందుకే డిల్లీ వేదికగా అమరణ దీక్షకు దిగుతానని ఆయన సన్నిహితులతో అంటున్నట్లు కథనం. ఆభరణాలు అదృశ్యం కావడం, స్వామివారికి సేవల్లో లోపం జరుగుతుండటంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్న ఆయన, ఇప్పటికే ఈ విషయం మీద సుప్రీం కోర్టుకు వెళతానన్న బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామిని కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే రమణ దీక్షితులు విషయంలో ఆయనకీ పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు. దాదాపు 25 సంవత్సరాలకు పైగా శ్రీవెంకటేశ్వరునికి సేవలందిస్తున్న వ్యక్తి, అధికారుల వైఖరి, చేస్తున్న తప్పులపై ఆరోపణలు చేస్తుంటే, వాటిపై విచారణ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఏపీ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. గతంలో ఎన్నోసార్లు రమణ దీక్షితులతో ఆశీర్వచనాలు పొందిన చంద్రబాబు, ఇప్పుడాయన్ను రాజకీయ కారణాలు, వ్యక్తిగత ప్రయోజనాలు, తనకు మద్దతిస్తున్న వారి ప్రయోజనాలను కాపాడేందుకు బలి చేశారని అనిపిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్, ఈ ఉదయం మీడియాతో మాట్లాడారు. తిరుమలలో టీటీడీ చేస్తున్న అక్రమాలపై భక్తుల్లోనూ అనుమానాలు నెలకొని వున్నాయని, వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత చంద్రబాబుదేనని అన్నారు. టీటీడీపై వస్తున్న ఆరోపణలపై నిజానిజాలను నిగ్గు తేల్చాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.