కొద్ది రోజుల నుండి జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ అధ్యక్షుడు జగన్ మధ్య మాటల యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే. పవన్ పై జగన్ పెళ్ళిళ్ళ పేరిట వ్యక్తిగత విమర్శలు గుప్పించడంతో వాటికి పవన్ తనదైన శైలిలో స్పందించారు. దీంతో ఇరు పార్టీల, పార్టీల సానుభూతిపరుల మధ్య నువ్వా నేనా అన్న చందాన మాటల యుద్ధం సాగుతోంది. నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడని జగన్ అంటే ఒకే పెళ్లి చేసుకుని బలాదూర్ తిరగాడంలేదని పవన్ కౌంటర్ ఇచ్చాడు. ఇలా సాగుతున్న తరుణంలో తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. త్వరలోనే వైసీపీ, జనసేనలు కలిసిపోతాయని తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మంగళవారం ఆయన తిరుపతిలో మాట్లాడుతూ వైసీపీ, జనసేన పార్టీలు త్వరలోనే ఒక్కటవుతాయని, వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాయని క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా జనసేనాని పై వరప్రసాద్ ప్రశంసలు కురిపించారు.
పవన్ విజన్ ఉన్న నాయకుడని, గతంలో తాను ప్రజారాజ్యం తరఫున తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు పవన్‌ను చాలా దగ్గరుండి గమనించానని, సమాజానికి ఏదో చేయాలన్న తపన, బాధ్యత పవన్ కల్యాణ్‌లో కనిపిస్తాయని కితాబిచ్చారు. అంతేకాదు, వైసీపీలో చాలా విశ్వాసంగా పనిచేస్తున్న తానే ఈసారి తిరుపతి నుంచి బరిలోకి దిగబోతున్నట్టు పేర్కొన్నారు. గతంలోనూ అనేక సందర్భాల్లో మాజీ ఎంపీ వరప్రసాద్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు పవన్ మద్దతు ఇస్తానని పవన్ తనతో చెప్పినట్టు గత జూన్‌లో వరప్రసాద్ మీడియా ముందు వెల్లడించారు. అయితే అప్పటి నుండి ఎప్పుడూ పవన్ ఈ వ్యాఖ్యల మీద స్పందించలేదు, దీంతో వారి కలయిక మీద జనాల్లోను ఆసక్తి రేగుతోంది.