పవన్ కళ్యాణ్ కి ఆపరేషన్

Pawan Kalyan to undergo eye surgery

జనసేన పార్టీని అన్నీ తానై నడిపిస్తున్న సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర నుంచి పోరాటయాత్ర మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. సందడిగా సాగుతున్న ఆ యాత్ర రంజాన్ కారణంగా బ్రేక్ పడింది. అయితే రంజాన్ పూర్తి అయినప్పటికీ పవన్ పోరాటయాత్ర తిరిగి ప్రారంభం కాకపోవడంతో..అందరి దృష్టి జనసేనాని పైనే పడింది. ఎందుకు యాత్ర తిరిగి ప్రారంభం కాలేదు? అసలు పవన్ కు ఏమైంది? అనే చర్చ తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త అంశం తెరమీదకు వచ్చింది. అదేమిటి అంటే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కంటి సర్జరీ చేయించుకోబోతున్నారు. గత కొన్ని నెలలుగా ఐ ఇన్‌ఫెక్షన్‌తో బాధ పడుతున్న ఆయనకు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో సర్జరీ నిర్వహించనున్నారు. జనసేనానికి శస్త్రచికిత్స వలనే పోరాటయాత్రలో జాప్యం జరుగుతోందట. ఈ విషయాన్నిజనసేన పార్టీ స్వయంగా వెల్లడించింది.

పవన్ కళ్యాణ్ ని మూడునెలలుగా కంటి సమస్య బాధిస్తున్నదని జనసేన తెలిపింది. అందుకే ఆ కారణంగానే ఆయన గత కొన్ని రోజులుగా ఎక్కడికి వెళ్లినా చలువ కళ్లద్దాలతో కనిపిస్తున్న తెలిసిందే. తాను చలువ కళ్లద్దాలు పెట్టుకునేది స్టైల్ కోసం కాదని, కంటికి సంబంధించిన సమస్యతో బాధ పడుతున్నానని, ఎక్కువ వెలుతురు చూడలేక పోతున్నానని, అందుకే వాటిని దరిస్తున్న పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో వెల్లడించారు. తాజాగా జరిగిన వైద్య పరీక్షలను పరిశీలించిన డాక్టర్లు శస్త్ర చికిత్సకు ఇంకొంత కాలం ఆగాలని సూచించారని జనసేన పేర్కొంది. ఈ నెల 24 న శస్త్ర చికిత్స చేయాలని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి డాక్టర్లు నిర్ణయించారని వివరించింది. పవన్‌ పోరాట యాత్ర ఈ నెల 26 నుంచి విశాఖ జిల్లాలో పునః ప్రారంభం కానుంది. ఈ మలివిడత యాత్ర విశాఖ జిల్లాలో మూడు నుంచి నాలుగు రోజులపాటు కొనసాగుతుంది.జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటిస్తారు.