పవన్ నిద్ర లేచాడుగా !

pawan kalyan tweets on ap govt At porata Yatra

ఈ మధ్య కాలంలో పోరాట యాత్ర అంటూ మొదలెట్టి మాటిమాటికీ బ్రేక్ లు ఇస్తూ మొన్న రంజాన్ బ్రేక్ తీసుకున్న పవన్ కళ్యాణ్ మళ్ళీ నిద్ర లేచాడు. నిద్ర లేచినా ఇప్పుడు ఆయన చెప్పిన విషయాలు పెద్దగా ఏమి లేవనుకొండి. తాజాగా కొద్దిరోజుల అజ్ఞాతానికి బ్రేక్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై పవన్ కల్యాణ్ మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. రాజధాని భూములపై స్పందించిన పవన్ భూముల్ని రక్షించాల్సిన ప్రభుత్వమే కబ్జాలకు అండగా ఉంటోందని, అమరావతి నిర్మాణం కోసం ఇప్పటికే సరిపడా భూముల్ని సమీకరించినందున భూసేకరణ చట్టాన్ని ప్రయోగించవద్దని సూచించిన ఆయన, అలా చేస్తే తాను పోరాటం చేస్తానని హెచ్చరించారు. ఈ అంశంపై అమరావతి ప్రాంత రైతులతో తాను సమావేశం కానున్నట్లు తెలిపారు. సోంపేట థర్మల్ విద్యుత్, కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రాల విషయంలో ప్రభుత్వ వైఖరిని సైతం పవన్ తప్పుబడుతూ ట్వీట్ చేశారు.

‘ఏపీ సీనియర్ రాజకీయ నాయకులు తమ దోపిడీలను ఆపాలి.. వెనుకబడిన ఉత్తరాంధ్రను ఇంకా శాశ్వతంగా అలాగే ఉంచడానికి ప్రయత్నిస్తూ కాలుష్యకారక పరిశ్రమలను ఏర్పాటుచేసి దాన్ని ఓ డంపింగ్ యార్డుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని’ దుమ్మెత్తిపోశారు. అలాగే ‘గులాబీ రంగు వజ్రంతోపాటు విలువైన శ్రీవారి ఆభరణాలపై రమణదీక్షితుల ఆరోపణలకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం కూడా సంతృప్తికరంగా లేదని విమర్శించారు. ‘భక్తులు విసిరిన నాణేలుకు గులాబీ రంగు వజ్రం ముక్కలైందని అంటున్నారు.. అందులో ఉన్న నిజమెంతో భక్తులుగా తెలుసుకోవాలనుకుంటున్నాం.. అలాంటప్పుడు ఆ శకలాలను ఎందుకు ఫోరెన్సిక్ నిపుణులతో పరీక్షించడం లేదు.. మరి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలనే సామెత కూడా ఉంది కదా’అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అలాగే “కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఓ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ను కలవడం జరిగింది. ఆ సందర్భంగా టీటీడీ నగలపై ఆయన కీలకమైన విషయాలను నాకు చెప్పారు. ప్రతిపక్ష నేతలు, టీడీపీ నేతలకు కూడా ఆ విషయం తెలుసు. అతను చెప్పిన దాని ప్రకారం… స్వామివారి నగలు మధ్యప్రాచ్య దేశాలకు ఓ ప్రైవేట్ విమానంలో తరలి వెళ్లాయి. అందువల్లే తిరుమల మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలు నాకు ఆశ్చర్యంగా అనిపించలేదు. వేంకటేశ్వరస్వామి మౌనంగా ఉన్నారు… ఆయన నగలను దొంగిలించవచ్చని దొంగలు అనుకుంటున్నారు” అంటూ ట్వీట్ చేశారు.