విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం మొండి చెయ్యి చూపడానికి ప్రధాన కారణం ఏంటి ? ఇక్కడ బీజేపీ కి రాజకీయ బలం లేకపోవడం ఒక ఎత్తు అయితే ,లోక్ సభ స్థానాలు తక్కువగా ఉండటం ఇంకో కారణం. మొత్తం 25 లోక్ సభ స్థానాల్లో ప్రధాన పక్షాలు పంచుకుంటే ఎటు వైపైనా పదికి మించి మెజారిటీ వుండబోదన్న అభిప్రాయమే మోడీ , షా లు ఏపీ మీద శీతకన్ను వేయడానికి దారి తీస్తోంది. అయితే ఈ సమస్య తీరడానికి ఏదో ఒక పార్టీ ఎక్కువ స్థానాలు సాధించి , ఆ స్థానాలతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీకి అవసరం పడితేనే ఆంధ్రప్రదేశ్ ఆశలు , ఆకాంక్షలు గురించి పట్టించుకునే అవకాశం వుంది. ఈ విషయం కొద్దిపాటి రాజకీయ పరిజ్ఞానం వున్న ఎవరికైనా తెలిసిన విషయమే.అయితే ఆ రేసులో ముందుకి రావడం కష్టం అనుకున్నారో ఏమో గానీ జనసేనాని కొత్త లెక్కలు చెపుతున్నారు.
మొత్తం భారతదేశం అంతటా కలిపి 543 ఉంటే , ఆంధ్రప్రదేశ్ లో వాటి సంఖ్య కేవలం 25 అని ముందే చెప్పుకున్నాం. అయితే తాజా గా ఓ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ సంఖ్యని ఏకంగా 175 కి పెంచారు. ఏపీ లో శాసనసభకు వున్న 175 స్థానాలకు బదులు ఆయన ఎంపీ స్థానాలు అని చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఆయన రాజకీయ పరిజ్ఞానం మీద ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్న తరుణంలో ఈ తరహా వ్యాఖ్యలు ఆ డౌట్స్ ని ఇంకాస్త పెంచుతాయి. సరే పొరపాటు అని వూరుకుందాం అంటే ఇదే తరహా పొరపాటు చేస్తున్న లోకేష్ గురించి ప్రస్తావించి పవన్ చాలా కామెంట్స్ చేశారు. అందుకే ఇప్పుడు పవన్ వ్యాఖ్యల్ని టీడీపీ శ్రేణులు ఆయుధంగా మార్చుకున్నాయి. మొత్తానికి ఆ విధంగా దేశంలో పవన్ ఆంధ్రా విలువ పెంచారని దేశం వర్గాలు పవన్ మీద కౌంటర్లు వేస్తున్నాయి.