జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన ‘జనసేన కవాతు’ ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా పిచ్చుకల లంక నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా సర్ ఆర్ధర్ కాటన్ విగ్రహం వరకు కవాతు కొనసాగుతోంది. జనసైనికులు, అభిమానుల మధ్య కారులోనే పవన్ కళ్యాణ్ కవాతు చేస్తూ వెళ్తున్నారు. జనసేనాని పిలుపు మేరకు జనసైనికులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లక్షలాది జనసైనికుల మధ్య పవన్ కళ్యాణ్ తన కాన్వాయ్‌తో కాటన్ విగ్రహం వద్ద సభా ప్రాంగణానికి వెళ్తున్నారు.
తెల్లని పంచ, పైజమా ధరించిన పవన్.. కారుపైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ జనసేన జెండాలతో నిండిపోయింది. ఇక కాటన్ విగ్రహం వద్ద సభా వేదికపై ఇప్పటికే సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు తమ ఆటపాటలు, డప్పు వాయిద్యాలతో అలరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణం వద్దకు చేరుకున్న అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.