జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలు సామాన్య ప్రజానీకానికే కాదు తలపండిన రాజకీయ విశ్లేషకులుకి సైతం అర్ధం కావడంలేదు. నాలుగేళ్ల క్రితం రాజకీయ వేదిక ప్రారంభించిన ఆయన కొద్ది నెలెల క్రితం రాజకీయం మొదలెట్టారు. తర్వాత జనాల్లోకి వెళ్ళాలి అంటూ ఒక బస్సు యాత్ర మొదలెట్టారు. పేరుకి బస్సు యాత్ర కానీ అదంతా కార్లలోనే సాగుతుందనుకోండి అది వేరే విషయం. ఇప్పుడు ఆ యాత్ర కూడా గాలిలో దీపంలా మారింది. ఉత్తరాంధ్రలో నలభై ఐదు రోజుల పాటు పర్యటిస్తానని ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులు కవాతులు చేస్తానని మొదట్లో ఘనంగా ప్రకటించారు జనసేనాదినేత. ఇచ్చాపురం ప్రారంభించి పాయకరావు పేట యాత్రకు ఇరవై రోజులు పట్టింది. ఈ ఇరవై రోజుల్లో పది రోజులు విశ్రాంతి తీసుకున్నారు అది వేరే విషయం. సెక్యూరిటీకి గాయాలయ్యాయని ఓ సారి, జ్వరం వచ్చిందని మరోసారి నాలుగు రోజుల పాటు బయటకే రాలేదు. ఆ తర్వాత సెక్యూరిటీకి రంజాన్ సెలవులివ్వలాంటూ వారం రోజుల ముందుగానే యాత్ర ఆపేశారు.
రంజాన్ ప్రారంభమైన పది రోజుల తర్వాత మళ్లీ పోరాటయాత్ర వివరాలు ప్రకటించారు. ఇరవై ఆరు నుంచి… ఎక్కడైతే ఆపేశారో.. అక్కడి నుంచే పోరాటయాత్ర ప్రారంభమవుతుందన్నారు. తీరా ఇరవై ఆరో తేదీ వచ్చేసరికి మరో ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. 28వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని (అది కూడా డౌటేననుకోండి). విజవాయడ- గుంటూరు మధ్యలో తనకు రెండు ఎకరాలను రూ. 40 లక్షలకే ఇచ్చిన(అమ్మిన) లింగమనేని సంస్థ నిర్మించిన దశావతార వెంకటేశ్వరుని ఆలయం విగ్రహప్రతిష్ఠాపనలో పాల్గొనేందుకు ఇరవై ఒకటో తేదీనే విజయవాడ వచ్చినా ఆలయ కార్యక్రమంలో పాల్గొన్నాకా ఏమయిపోయారో, ఏం చేశారో ఎవరికీ తెలియదు.
ఇప్పుదు తాజాగా భూసేకరణ చట్టం గురించి విజయవాడలో చర్చించారని మరో విడత విశాఖలో చర్చిస్తారని జనసేన వర్గాలు చెప్పుకొచ్చాయి. నిజానికి భూసేకరణ చట్టంపై ఇప్పటికిప్పుడు ఎందుకు చర్చిస్తున్నారో ఎవరితో చర్చిస్తున్నారో ఎవరికీ క్లారిటీ లేదు. ఇప్పుడే కాదు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి మేధావులతో సమావేశాలని అదే పనిగా ప్రకటనలు చేస్తూనే ఉంటారు. మేధావులంటే వారేదో ఆకాశం నుంచి ఊడిపడిన వ్యక్తులన్నట్లుగా జనసేన వర్గాలు చెబుతూంటాయి. అంత గొప్పగా పవన్ కల్యాణ్ తో చర్చించే మేధావులు ఎవరా అంటే ఎవరికీ తెలియదు. సినిమాల కంటే రాజకీయాల్లో కంటిన్యూటీ చాలా ముఖ్యం. ఈ విషయం పవన్ కల్యాణ్‌కు తెలియక కాదు. కానీ పవన్ ఈ విషయంలో తేలిపోయాడు, పవన్ వ్యవహరిస్తున్న తీరు చూసి పవన్ రాజకీయాలకి అన్ ఫిట్ అని కొందరు, ప్రజలేమన్నా పిచ్చోల్లలా పవన్ కి కనిపిస్తున్నారా అని మరి కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఒక్క సారి యాత్ర ప్రకటిస్తే ఎన్ని కష్టాలు ఓర్చుకుని అయినా పూర్తి చేయాలి. పాపం జగన్ కూడా ప్రజా సంకల్ప యాత్ర స్టార్ట్ కావడానికి ఇలానే తిప్పలు పడ్డాడు. చివరికి స్టార్ట్ అయ్యాక తన సహజ సిద్దమయిన శుక్రవారం రోజు తప్ప మిగతా రోజుల్లో యాత్ర ఆగకుండా చూసుకుంటున్నాడు. కానీ పవన్ మాత్రం తనకు గుర్తున్నప్పుడు మాత్రమే పోరాట యాత్ర చేసి ఇష్టం లేకపోతే ఆరోగ్యం బాలేదనో, సెక్యురిటి తక్కువ ఉందనో, మేధావులతో సమావేశాలనో ఒక రిసార్టుకో, తన గడికో పరిమిమతవుతున్నారు. దీని వల్ల ప్రజల్లో ఆయనో రాజకీయ నేత అనే భావనే లేకుండా పోతోంది. అంతే కాక ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కంటే పోరాటాల్లో గానీ మరి కొన్ని విషయాల్లో కానీ పవన్ బెటర్ అనిపించుకోవాలి కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం వ్యతిరేకంగా ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే పవన్ పార్టీ గెలవడం కాదు కదా డిపాజిట్లు కూడా గల్లంతు అవుతాయంటే అతిశయోక్తి కాదు.