2019 ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయనిపిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని ఎదుర్కొనేందుకు బీజేపే పవన్, జగన్ లను ఏకం చేసి ఎలా అయినా దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుందని ఆ ఆపరేషన్ పేరు ఆపరేషన్ గరుడ అని ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇప్పటి వరకు రహస్యంగా నడుస్తూ వచ్చిన ఈ భంధం కొన్ని కొన్ని విషయాల్లో బయటపడేలా చేసింది. అయితే తాజాగా వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ మాటలతో ‘వైసీపీకే జనసేన మద్దతు’పై మరింత బలం చేకూరినట్లైంది. తనకు జనసేనానే స్వయంగా కాల్ చేసి వైసీపీకి 2019లో మద్దతిస్తానని చెప్పారని అవిశ్వాస తీర్మానం సమయంలో వరప్రసాద్ బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు పవన్ 2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతిస్తారని.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తనతో చెప్పారని వరప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014లో చంద్రబాబు అనుభవం కలిగిన వ్యక్తి అని, అవినీతి చేయరన్న ఉద్దేశంతో తాను సమర్థించానని పవన్ చెప్పినట్లు ఆయన వెల్లడించారు. అయితే నాలుగు సంవత్సరాల పాలనలో చంద్రబాబు హోదా సాధించలేకపోయారని, అవినీతి పెరిగిపోతోందని, ప్రజలకేమీ చేయలేదని అందుకని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుకు మద్దతు తెలపనని జనసేనాని స్పష్టం చేశారని వరప్రసాద్ చెప్పుకొచ్చారు.
2019లో మద్దతంటూ ఇస్తే వ్యక్తిగతంగా అన్యాయం జరిగిన కష్టజీవి జగన్మోహన్‌రెడ్డికి సపోర్ట్ చేస్తానని పవన్ చెప్పారని ఇది వాస్తవమని ఆయన అభిప్రాయం పట్ల తాను హర్షం వ్యక్తం చేస్తున్నానని ఈ వైసీపీ మాజీ ఎంపీ బాంబు పేల్చారు. దీంతో ఇన్నాళ్లూ పవన్, జగన్ కలిసి బీజేపీ ఆడిస్తున్నట్లు ఆడుతున్నారన్న టీడీపీ ఆరోపణలకు వరప్రసాద్ వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చుతున్నాయి. ఏదేమైనా ఈ వైసీపీ మాజీ ఎంపీ ప్రకటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. పవన్‌పై ఇప్పటికే రెండు సార్లు వరప్రసాద్ మద్దతు విషయంలో వ్యాఖ్యలు చేసినా ఇంత వరకూ ఇది నిజమా..? కాదా..? అని విషయంపై పవన్ క్లారిటీ ఇవ్వలేదు. అంతేకాదు తానెవ్వరికీ మద్దతివ్వనని ఒక్కసారి కూడా పవన్ ఖండించకపోవడాన్ని చూస్తుంటే వైసీపీ నేతల మాటలు అక్షర సత్యమేనేమోనని అందరూ అనుకుంటున్నారు. ఈ విషయంపై జనసేనికుల సైతం కాస్త డైలామాలో ఉన్నారని తెలుస్తోంది.