ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుండి మార్చాలని సీఎం జగన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంతానికి చెందిన రైతులందరూ కూడా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. కాగా అక్కడి రైతులకు సంఘీభావం తెలిపేందుకు మందడం ప్రాంతానికి పాదయాత్రగా వెళ్లినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ని పోలీసులు అరెస్టు చేశారు. చంద్రబాబు తో పాటు పలువురు నేతలను కూడా అరెస్టు చేశారు. ఇకపోతే చంద్రబాబు ని అరెస్టు చేసి పోలీసులు పలు ప్రాంతాల్లో తిప్పి, చివరికి మంగళగిరి కి తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రయాణిస్తున్నటువంటి వాహనాన్ని తెదేపా ఎమ్మెల్యేలు మంగళగిరిలో అడ్డుకున్నారు. అక్కడితో ఆగకుండా రహదారిపై బైఠాయించి తీవ్రమైన ఆందోళన చేపట్టారు. డొంక రోడ్డులో వాహనాన్ని ఎలా తిప్పుతారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ సందర్భంలో టీడీపీ నేతలకు మరియు పోలీసులకు స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పాలి. అయితే పోలీసుల పని తీరుకు నిరసనగా చంద్రబాబు నాయుడు బస్సు దిగేసి, మంగళగిరి వీధుల్లో పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో నారా లోకేశ్, తెదేపా ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.