దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిర్భయ కేసులో నలుగురు దోషుల ఉరిశిక్ష అమలుకు రంగం సిద్ధమైంది. 16వ తేదీ సోమవారం ఉదయం 5 గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తున్నట్లు తిహార్ జైలు అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో దిశ సంఘటన తర్వాత దేశ వ్యాప్తంగా అత్యాచారాలు, హత్యలపై నిరసనలు వెల్లువెత్తాయి.
దీంతో వినయ్ శర్మ పిటిషన్ ను రిజెక్ట్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం వేగంగా నిర్ణయం తీసుకుంది. ఇదే నిర్ణయాన్ని సమర్థిస్తూ శుక్రవారమే కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి రికమెండ్ చేసింది. దీనిపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి ముందే వినయ్ శర్మ పిటిషన్ ను వెనక్కి తీసుకోవడం విశేషం. ఇలా న్యాయసంబంధ అంశాలన్నీ క్లియర్ అవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. మరోవైపు జైలు అధికారులు ఉరితీసేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నారు.
2012 డిసెంబర్ 16న ఆరుగురు కలిసి నిర్భయను అత్యంత దారుణంగా అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. అయితే ఆమెపై ఈ ఘాతుకానికి పాల్పడిన డిసెంబర్ 16 నే నలుగురు దోషులను ఉరి తీస్తుండటం విశేషం. దోషుల్లో ఒకరు జూవైనల్ కస్టడీలో ఉండగా.. మరో దోషి రామ్‌సింగ్ జైలులోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. మిగిలిన నలుగురికి ఆమెను చెరబట్టిన రోజే అధికారులు కఠిన శిక్ష అమలు చేస్తున్నారు.