వినాయక గుడిని క్వారంటైన్ చేశారంటూ పోస్ట్… ఆపై అరెస్ట్..

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కాణిపాకంలోని వినాయక ఆలయాన్ని క్వారంటైన్ కేంద్రంగా మార్చారంటూ తప్పుడు ప్రచారం చేసిన తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనాపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వాలు, పోలీసులు ఈ మధ్య తీవ్రంగా హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. అయినా గానీ… ఎలాంటి మార్పు రావడం లేదు. వాట్సాప్‌, ఫేస్‌బుక్ గ్రూపుల్లో వచ్చిన సమాచారాన్ని చెక్ చేసుకోకుండా అందరికీ పంపించేస్తున్నారు. దీనిపై స్పందించిన పోలీసులు జైలుకు పంపిస్తున్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం వినాయక ఆలయాన్ని క్వారంటైన్ కేంద్రంగా మార్చారంటూ ఈ మధ్య సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది.

అయితే ఇదంతా అసత్యమని.. ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తే అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. కాణిపాకం ఆలయాన్ని క్వారంటైన్‌ సెంటర్‌గా ఏర్పాటు చేశారంటూ తెలంగాణలోని సిద్దిపేట జిల్లాకు చెందిన ఎం.విష్ణువర్ధన్‌రెడ్డి తన ఫేస్‌బుక్, ట్విటర్‌ ఖాతాల్లో తప్పుడు పోస్ట్ చేశాడు. దీనిపై జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన ఓ వీడియోను కూడా పోస్టు చేశారు. తన స్నేహితులు, బంధువులకు దాన్ని పంపించారు. ఈ వీడియో కాణిపాకం ఆలయ ఈఓకి చేరడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా చిత్తూరు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తాజాగా ఆయన్ని కోర్టులో హాజరు పరచి చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు. కరోనాపై ఫేక్ న్యూస్‌ ప్రచారం చేసేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.