వాహనదారులకు పెట్రోల్, డీజిల్ రేట్లు కనికరం చూపిస్తున్నాయి. గత నెలన్నరగా ధరలలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. సోమవారం కూడా పెట్రోల్, డీజిల్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీలను తగ్గించిన తర్వాత, రికార్డు స్థాయిల నుంచి ధరలు దిగొచ్చాయి. రికార్డు స్థాయిలో పెరుగుతోన్న ఇంధన ధరల నుంచి వాహనదారులకు ఉపశమనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్‌పై రూ.5, లీటరు డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. ఆ తర్వాత చాలా రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై విధించే వాల్యు యాడెడ్ ట్యాక్స్ల ను తగ్గించాయి.
హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.108.20గా, లీటరు డీజిల్ ధర రూ.94.62గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.95.41గా, లీటరు డీజిల్ ధర రూ.86.67గా నమోదైంది. అదేవిధంగా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు మారలేదు. ఆర్థిక రాజధాని లీటరు పెట్రోల్ రూ.109.98గా, డీజిల్ రేటు రూ.94.14గా స్థిరంగా ఉన్నాయి. కోల్‌కతాలో కూడా ధరలలో ఎలాంటి మార్పు లేదు. ఈ ప్రాంతంలో లీటరు పెట్రోల్ రూ.104.67గా, లీటరు డీజిల్ రూ.89.79గా పలుకుతోంది. చెన్నైలో లీటరు పెట్రోల్ రూ.101.40గా, లీటరు డీజిల్ రూ.91.43గా ఉంది.
వ్యాట్ తగ్గింపు ప్రయోజనాలను వాహనదారులకు అందించిన రాష్ట్రాలలో లద్దాఖ్, కర్నాటక, పుదుచ్చేరి, జమ్మూకశ్మీర్, సిక్కిం, మిజోరాం, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, డామన్ అండ్ డయ్యూ, దాద్రా నగర్ హవేలి, చండీగఢ్, చత్తీస్ గఢ్, అస్సాం, మధ్య ప్రదేశ్, త్రిపుర, గుజరాత్, నాగాలాండ్, పంజాబ్, గోవా, మేఘాలయ, ఒడిశా, రాజస్తాన్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, అండమాన్ అండ్ నికోబార్, బిహార్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా ఉన్నాయి.
వ్యాట్ తగ్గింపు చేపట్టని రాష్ట్రాలలో మహారాష్ట్ర, ఝార్ఖాండ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, తెలంగాణ, ఏపీ ఉన్నాయి. కాంగ్రెస్ పరిపాలిత రాష్ట్రం పంజాబ్‌లో పెట్రోల్ ధర భారీగా తగ్గింది. డీజిల్ రేటు కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌లో భారీగా దిగొచ్చింది. పంజాబ్‌లో అతిపెద్ద నగరమైన లుధియానాలో పెట్రోల్ రేటు రూ.95.21గా ఉండగా… డీజిల్ రేటు రూ.84.01గా ఉంది.