Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలతో దేశంలో మోడీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయిందని ప్రచారం చేస్తున్నవారికి ప్యూ రీసెర్చ్ షాకిచ్చింది. ఈ సంచలనాత్మక నిర్ణయాల తర్వాత తొలిరోజుల్లో మోడీకి పరిస్థితులు కొంత ప్రతికూలంగా మారినప్పటికీ… ఇప్పుడు మాత్రం మళ్లీ ఆయనకు ఆదరణ పెరిగిపోయిందని ఈ సర్వే తేల్చింది. విచిత్రంగా ఈ ఏడాది ఆయనకు జనాదరణ పెరగడానికి ఆ సంచలనాత్మక నిర్ణయాలే కారణమని సర్వే అభిప్రాయపడింది. ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రతినిధులు 2, 464 మందిపై ఈ సర్వే జరిపారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న 2016 సంవత్సరం చివరిరోజుల్లో, జీఎస్టీ నిర్ణయం తీసుకున్న 2017లో మోడీ ఆదరణ 81శాతానికి పడిపోగా… ఇప్పుడు 88శాతానికి పెరిగిందని సర్వేలో వెల్లడయింది. గత మూడేళ్ల కాలంలో మోడీకి జనాదరణ మూడు రెట్లు పెరిగింది.
2014 ఎన్నికలు తర్వాత భారత ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయని మెజార్టీ ప్రజలు భావిస్తున్నారు. దేశంలోని నిరుద్యోగ సమస్యకు తోడు ఆర్థిక సమస్యలు మోడీకి కొంత ప్రతికూలంగా మారినప్పటికీ… ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థపై ఎక్కువమంది నుంచి సంతృప్తి వ్యక్తమయింది. సర్వేలో మరో ఆసక్తి గొలిపే అంశం… మోడీపై ఉత్తరాది ప్రజలకన్నా… బీజేపీ ప్రభావం ఏమంతగా లేని దక్షిణ భారతదేశం ప్రజలకు ఎక్కువ నమ్మకం ఉండడం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 84 శాతం మోడీకి అనుకూలంగా ఉండగా… దక్షిణాది రాష్ట్రాల నుంచి మాత్రం 95శాతం అనుకూలంగా ఉన్నారు. మొత్తానికి ఏ నిర్ణయాలను అడ్డుపెట్టుకుని మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రచారం సాగిస్తున్నాయో… అవే నిర్ణయాలు ప్రధానికి జనాదరణ పెంచుతున్నాయని సర్వేలో తేలడం… ప్రస్తుత తరుణంలో అత్యంత కీలకపరిణామం.