Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టీడీపీ ఎంపీలకు ఇచ్చిన అపాయింట్ మెంట్ రద్దుచేసి మరీ… వైసీపీ ఎంపీ వరప్రసాద్ తో రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ భేటీ కావడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మిత్రపక్షం ఎంపీలకు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా. వైసీపీ ఎంపీకి ఇవ్వడం ఏంటని నిలదీశారు. బీజేపీ చర్యలు చూసి… ఆ పార్టీ మిత్ర పక్షం టీడీపీనా… వైసీపీనా అని ప్రజలకు సందేహం కలుగుతోందని, లాలూచీ పడేవాళ్లు ప్రజల దృష్టిలో దోషులుగా మిగిలిపోతారని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఏపీ సమస్యలపై కేంద్రం స్పందించకపోవడం అన్యాయమని, కేంద్రం వైఖరి రాష్ట్ర ప్రజలను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దశలవారీగా పోరాటం ఉధృతం చేయాలని ఎంపీలకు సూచించారు.
రాష్ట్రానికి న్యాయం జరిగేవరకు వదిలిపెట్టేది లేదని, ఇక్కడి శాసన సభ, శాసన మండలిలో, అక్కడ లోక్ సభ, రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ సమస్యలే ప్రతిధ్వనించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆర్థిక బిల్లులపై చర్చలు జరుగుతున్న సమయంలో రాష్ట్రానికి హోదా, నిధుల సాయంపై మాట్లాడాలని, ఎంపీలందరూ విధిగా సభకు హాజరుకావాలని ఆదేశించారు. జాతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీల అమలుపై ఢిల్లీ వేదికగా ప్రశ్నించాలని, జాతీయ పార్టీల నిర్లక్ష్యాన్ని, ఉదాసీనతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ప్రజలే ప్రభుత్వానికి హైకమాండ్ అని, ప్రజల ఆకాంక్షలే మనకు ముఖ్యమని చంద్రబాబు స్పష్టంచేశారు.