Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గుజరాత్ ఎన్నికల ప్రచారం చివరి రోజు ప్రధాని అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. చడీచప్పుడూ లేకుండా… దేశంలోనే తొలిసారి సముద్ర విమాన ప్రయాణం చేశారు. చివరిరోజు ప్రధాని అహ్మదాబాద్ లో రోడ్ షో నిర్వహించాల్సి ఉన్నా… పోలీసులు అనుమతించకపోవడంతో అది రద్దయింది. వెంటనే ప్రధాని వినూత్నంగా గుజరాత్ ప్రజల ముందుకు వెళ్లారు. సబర్మతి నదిలో సముద్ర విమానంలో ప్రయాణించి ధారోయ్ డ్యామ్ కు చేరుకున్నారు. సముద్ర విమానంలో ప్రధాని 150 కిలోమీటర్లు ప్రయాణించారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా అంబాజీ వెళ్లి అంబా మాత ఆలయంలో పూజలు చేశారు. మోడీ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి గురించి మాట్లాడడం లేదని కాంగ్రెస్ పదే పదే విమర్శిస్తున్న నేపథ్యంలో మోడీ సీ ప్లేన్ లో ప్రయాణించడం ద్వారా..ఆ విమర్శల్ని తనదైన రీతిలో తిప్పికొట్టారు.
కాంగ్రెస్ ఇలాంటి అభివృద్ధిని కనీసం ఊహించి కూడా ఉండదని మోడీ ట్విట్టర్ లో వ్యంగాస్త్రాలు సంధించారు. దేశంలో అన్ని చోట్లా ఎయిర్ పోర్టులు నిర్మించడం సాధ్యం కాదని, అందుకే వాటర్ వేస్ పై దృష్టిపెట్టామని, దేశవ్యాప్తంగా 106 ప్రాంతాల్లో విమానాలు దిగేందుకు, టేకాఫ్ అయ్యేందుకు అనువుగా ఉన్న జలాశయాలను గుర్తించామని ప్రధాని వరుస ట్వీట్లలో వెల్లడించారు. అటు గుజరాత్ రెండో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 14 న ఎన్నికలు జరగనున్నాయి. 18న ఫలితాలు వెల్లడవుతాయి. గుజరాత్ లో ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ కాబోయే అధ్యక్షుడు రాహుల్ గాంధీ పూర్తి విశ్వాసం వ్యక్తంచేశారు. వచ్చే సోమవారం గుజరాత్ లో ఓట్లు లెక్కించిన తర్వాత జబర్దస్త్ ఫలితాలు వెల్లడవుతాయన్నారు. గత మూడు నెలలుగా రాహుల్ రాష్ట్రంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ మూడు నెలల కాలం గుజరాత్ ప్రజలు తనపై లెక్కలేనంత ప్రేమ కురిపించారని, ఇది తన జీవితంలో మర్చిపోలేనని రాహుల్ సంతోషం వ్యక్తంచేశారు. ఆలయాల సందర్శనకు వెళ్లిన ప్రతిసారీ గుజరాత్ కు బంగారు భవిష్యత్ ఉండాలని కోరుతున్నానని చెప్పారు. అహ్మదాబాద్ రోడ్ షో రద్దవడంతో రాహుల్ నగరంలోని ప్రఖ్యాత జగన్నాథ ఆలయాన్ని సందర్శించుకుని ప్రచారం ముగించారు. గుజరాత్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పై మోడీతో పాటు ఇతర బీజేపీ నేతలూ విమర్శనాస్త్రాల్ని సంధించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ చేసిన ఓ వ్యాఖ్య నెట్ లో షేర్ అవుతోంది. గుజరాత్ ప్రజలు ఈ ఎన్నికల ద్వారా రెండు మంచి పనులుచేశారని ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ఒకటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నోరు తెరిపించడమైతే… మరొకటి రాహుల్ గాంధీకి గుడులకు వెళ్లడం నేర్పించడమని వ్యంగాస్త్రాలు సంధించారు.