ఎట్ట‌కేల‌కు ట్రూడోను క‌లిసిన మోడీ

PM Modi Meets Canada PM Justin Trudeau At Rashtrapati Bhavan
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

వివాదాస్ప‌దంగా మారిన కెన‌డా ప్ర‌ధాని జస్టిన్ ట్రూడో వారం రోజుల భార‌త ప‌ర్య‌ట‌న చివ‌రి ద‌శ‌కు చేరుకుంది.  ట్రూడో కుటుంబం ఇండియా వ‌చ్చిన ఆరు రోజుల త‌ర్వాత ప్రధాని మోడీ వారిని క‌లిశారు. ఈ ఉద‌యం రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ లో ట్రూడోకు మోడీ సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. కారులోనుంచి ట్రూడో దిగ‌గానే మోడీ ఆయన‌తో క‌ర‌చాల‌నం చేసి ఆలింగ‌నం చేసుకున్నారు. ట్రూడో భార్యకు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చిన అనంత‌రం వారి పిల్ల‌లను ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. అనంత‌రం వారితో క‌లిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ సంద‌ర్భంగా ట్రూడో సైనికులు గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు.

మోడీ, ట్రూడో ఇవాళ ద్వైపాక్షిక చ‌ర్చ‌ల్లో భాగంగా కెన‌డాలో సిక్కు ఉగ్ర‌వాదంపైనా, ఉగ్ర‌వాద నిర్మూల‌న‌లో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంపైనా చ‌ర్చించ‌నున్నారు. ఇరు దేశాల మ‌ధ్య వాణిజ్యం, ర‌క్ష‌ణ‌, పౌర అణు స‌హ‌కారం, అంత‌రిక్షం, వాతావ‌ర‌ణ మార్పులు, స‌హ‌జ వ‌న‌రులు, విద్య త‌దిత‌ర రంగాల్లో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి సంబంధించిన అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు.

ట్రూడో ప‌ర్య‌ట‌నలో మోడీ వైఖ‌రిపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ట్రూడో కుటుంబంతో స‌హా భార‌త్ రాగా, మోడీ వారిని ఆహ్వానించ‌డానికి విమానాశ్ర‌యానికి వెళ్ల‌క‌పోవ‌డం, త‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్ లో ట్రూడో ప‌ర్య‌టిస్తున్నా..మోడీ వెంట వెళ్ల‌క‌పోవ‌డంపై భార‌త్, కెన‌డా మీడియాలు విమ‌ర్శ‌లు వ్య‌క్తంచేశాయి. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం మోడీ ట్విట్ట‌ర్ ద్వారా ట్రూడోకు స్వాగ‌తం ప‌లికారు. జ‌స్టిన్ ట్రూడో కుటుంబం ఇప్ప‌టివ‌ర‌కూ ఇండియాలో ఆనందంగా గ‌డిపింద‌ని భావిస్తున్నాను. వారి పిల్ల‌లు జేవియ‌ర్, ఎల్లా గ్రేస్ ల‌ను క‌లుసుకోవాల‌ని ఎంతో ఆతృత‌తో ఉన్నాను. నేను 2015లో కెన‌డాకు వెళ్లిన చిత్ర‌మిది. అప్ప‌ట్లో నేను ట్రూడోతో పాటు ఎల్లా గ్రేస్ ను క‌లిశాను. అని మోడీ ట్వీట్ చేశారు. ట్రూడో తోనూ గ్రేస్ తోనూ దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. అటు ఆరురోజులుగా మోడీ ట్రూడోకు దూరంగా ఉండ‌డానికి కెన‌డా ప్ర‌ధానిగా గ‌తంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లే కార‌ణ‌మ‌ని భార‌త వ‌ర్గాలు అంటున్నాయి.

కెన‌డాలో సిక్కు సంత‌తి అధికంగా ఉండ‌డంతో, ఇండియాలో సిక్కులు డిమాండ్ చేసే ఖ‌లిస్థాన్ పై ట్రూడో గ‌తంలో ప‌లుమార్లు మ‌ద్ద‌తు ప‌లికేలా వ్యాఖ్యలు చేయ‌డం భార‌త్ ను ఆగ్ర‌హానికి గురిచేసింద‌ని చెప్పాయి. కెన‌డాలోనే కాక భార‌త ప‌ర్య‌ట‌న‌లో కూడా ట్రూడో వైఖ‌రి వివాదాస్ప‌దంగా మారింది. ముంబైలో జ‌రిగిన విందుకు ఖ‌లిస్థాన్ ఉగ్ర‌వాది జ‌స్పాల్ అత్వాల్ ను ఆహ్వానించ‌డం, ట్రూడో భార్య జ‌స్పాల్ తో ఫొటో దిగ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.