సీఎం కేసీఆర్ గన్‌పార్క్‌లో తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అమరవీరులకు నివాళులు అర్పించి అసెంబ్లీకి వచ్చారు. అనంతరం హోంమంత్రి అలీ నివాళులు అర్పించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో అసెంబ్లీ తొలిసారిగా నేడు ప్రారంభమైంది. జాతీయ గీతంతో సభను ప్రారంభించారు. అనంతరం ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ సీఎం కేసీఆర్‌ను ప్రమాణం చేయడానికి ఆహ్వానించారు.
అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభలోని మహిళా ఎమ్మేల్యేలు ప్రమాణం చేశారు. వీరి తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం మిగతా ఎమ్మేల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అసెంబ్లీకి ఎన్నికైన 119(నామినేటెడ్ 1) మందిలో టీఆర్ఎస్ నుంచి 88 మంది ఎమ్మేల్యేలు, కాంగ్రెస్ నుంచి 19 మంది ఎమ్మేల్యేలు, 7 మంది ఎంఐఎం ఎమ్మేల్యేలు, టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మేల్యేలు, ఒక బీజేపీ ఎమ్మేల్యే ఉన్నారు. వీరితోపాటు ఇద్దరు ఇండిపెండెట్లు ఎంపికయ్యారు. వీరు అధికారిక పార్టీలో చేరడంతో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మేల్యేల సంఖ్య 90 కి చేరింది. లెక్కలు వేసి చూస్తే గత అసెంబ్లీలో ఉండి ప్రస్తుత అసెంబ్లీకి ఎన్నికైనవారు 76 మంది ఉన్నారు. ఉమ్మడి అసెంబ్లీలో సభ్యులుగా ఉండి ఎంపికైనవారు 16 మంది ఉన్నారు. 23 మంది కొత్తగా ఎంపికయ్యారు. ఎమ్మేల్యులగా ఎన్నికైన ఎంపీలు ఇద్దరు, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ముగ్గురు ఉన్నారు. మహిళా సభ్యులు ఆరుగురు, ముస్లిం మైనారిటీ సభ్యులు ఎనిమిది మంది, ఆంగ్లో ఇండియన్ ఒకరు ఉన్నారు. ఇక మిగిలి ఉన్న ఏకైక పక్రియ స్పీకర్ ఎన్నిక. స్పీకర్ ఎంపిక ఏకగ్రీవం కావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ విన్నపంపై అన్నీ పార్టీలు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంఐఎం, బీజేపీ పార్టీలు అంగీకారం తెలపగా సీఎల్పీ ఎంపిక కోసం గురువారం జరిగిన కాంగ్రెస్ ఎమ్మే్ల్యేల సమావేషంలోనూ ఏకగ్రీవానికే నేతలు మొగ్గు చూపినట్లు తెలిసింది. దీంతో స్పీకర్ పదవికి లైన్ క్లియర్ అయ్యింది. దీంతో అధికార పార్టీ తరఫున బాన్సువాడ పోచారం ఎమ్మేల్యే పోచారం శ్రీనివాస రెడ్డి స్పీకర్ పదవికి ఈ రోజు నామినేషన్ వేయనున్నారు. ఏకగ్రీవంపై అన్ని పార్టీలు ఒకే నిర్ణయానికి రావడంతో ఆయనే స్పీకర్‌గా ఎంపికకానున్నారు.