తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడినా నెల రోజుల నుండి శాసనసభను ఏర్పాటు చేయలేదు కొత్త ప్రభుత్వం. దీంతో తెరాస వ్యవహార శైలిపై విమర్శలు వచ్చాయి. ప్రతిపక్షాలు సీఎం కేసీఆర్ ఇతర పార్టీ సభ్యులపై దుమ్మెత్తిపోశాయి. ఈ పరిణామాల తర్వాత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని భావించారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, శాసనసభ సమావేశాలకు షెడ్యూల్ విడుదల చేశారు. ఇందులో భాగంగానే తెలంగాణలో రెండో ప్రభుత్వం కొలువుదీరింది. నామినేటెడ్ సభ్యుడితో కలిపి మొత్తం 119 మంది సభ్యులుండగా, గురువారం 114 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం టీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఏకగ్రీవ ఎన్నిక కోసం టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం రాత్రి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ను సంప్రదించారు. ఇందుకు అసద్, లక్ష్మణ్ వెంటనే తమ అంగీకారాన్ని తెలపగా, ఉత్తమ్ మాత్రం పార్టీలో చర్చించి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు.
గురువారం ఉదయం సీఎల్పీ భేటీ తర్వాత స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరిస్తామని టీపీసీసీ ప్రకటించింది. దీంతో శుక్రవారం తెలంగాణ రెండవ శాసనసభ స్పీకర్‌గా పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి గురువారం ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో, అసెంబ్లీ స్పీకర్‌గా పోచారం ఎన్నికైనట్లు శుక్రవారం సభలో ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ లాంఛనంగా ప్రకటన చేశారు. స్పీకర్ పోచారంకు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఎమ్మెల్యేలతో పాటు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. అనంతరం సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నేత ఉత్తమ్ కుమార్‌రెడ్డి తదితరులు వెంట రాగా పోచారం శ్రీనివాస్ స్పీకర్ కుర్చీలో ఆశీనులయ్యారు. బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ నేపధ్యంలో పోచారంకు సంబందించిన ఒక విషయాన్ని కేసీఆర్ పస్తవించారు, అదేంటంటే ఆయన అసలు ఇంటిపేరు పోచారం కాదట. పరిగె అట, పోచ్చారం అనేది అయన ఊరి పేరని, ఊరి పేరునే ఇంటి పేరుగా అమర్చుకున్న ఆయన తనకు అన్న లాంటి వాడని లక్ష్మీ పుత్రుడని ఆయన చెప్పుకొచ్చాడు.