10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు కూడా శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పించేవిధంగా సుప్రీంకోర్టు గత నెలలో తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. సుప్రీం తీర్పు తర్వాత అయ్యప్ప ఆలయాన్ని తొలిసారిగా బుధవారం (అక్టోబర్ 17) తెరుస్తున్నారు. ఈ నేపథ్యంలో శబరిమలలో అడుగుపెట్టడానికి పలువురు మహిళలు అక్కడికి చేరుకున్నారు. దీంతో శబరిమల ఇప్పుడు ఉద్రిక్తంగా మారింది. సన్నిధానంలోకి అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తున్న మహిళలను ఆందోళనకారులు, అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాలకు చెందిన కార్యకర్తలు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అయినా వారు వెనక్కి తగ్గకుండా పోలీసుల మీదకి రాళ్లదాడికి దిగారు. ఈ దాడులు, ప్రతిదాడులతో శబరిమలలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శబరిమలలో మహిళలు సురక్షితంగా అడుగుపెట్టేవిధంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయితే అప్పటికే భారీగా చేరుకున్న ఆందోళనకారులు, భక్తులు మహిళల ప్రవేశాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. పంబ నుంచి వెళ్లే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్న ఆందోళనకారులు మహిళలెవర్నీ కొండపైకి అనుమతించడం లేదు.
పోలీసులు కూడా ప్రేక్షకపాత్ర వహించాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాధవి అనే మహిళ తన కుమారుడితో పాటు మొట్టమొదటిసారిగా సన్నిధానం సమీపానికి చేరుకున్నారు. తీవ్ర ఉద్రిక్తల మధ్య సన్నిధానం వరకూ చేరుకున్న ఆమెకు చివరి నిమిషంలో చేదు అనుభవం ఎదురైంది. మాధవికి ఆందోళనకారులు పదే పదే అడ్డుతగిలారు. తోపులాట కారణంగా ఆమె సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో సన్నిధానంలోకి ప్రవేశించకుండానే వెనుదిరిగారు. మాధవి తర్వాత సన్నిధానం సమీపానికి చెందిన మరో కేరళ మహిళకు కూడా ఇదే తరహా అనుభవం ఎదురైంది. పంబ నుంచి నీలక్కళ్ వరకు పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శబరిమల ఆలయం వద్ద ఉద్రిక్తల నేపథ్యంలో అక్కడి పరిస్థితిని కవర్ చేయడానికి వెళ్లిన కొంత మంది మహిళా జర్నలిస్టులకు కూడా చేదు అనుభవం ఎదురైంది. మహిళలెవర్నీ ఆందోళనకారులు ముందుకు కదలనీయడం లేదు. ప్రతి వాహనాన్ని సునిశితంగా పరిశీలించి కొండపైకి అనుమతిస్తున్నారు. పోలీసులను కూడా లెక్కచేయడం లేదు.