ఐదు రోజులకే ఇలా ఉంటే…నలభై రోజుల పరిస్థితి ఏంటో…!

Supreme Court Lifts Ban On Entry Of Women In Sabarimala Temple

ప్రతి నెలలో చేస్తున్న పూజల నిమిత్తం ఈ నెలలో కూడా ఐదు రోజుల‌పాటు శ‌బ‌రిమ‌ల అయ్యప్ప ఆల‌యం త‌లుపులు తెరుచుకున్నాయి, మూసుకున్నాయి. ఈనెల 17 నుంచి 22 వ‌ర‌కూ మ‌హిళ‌ల‌కు అయ్య‌ప్ప స్వామి ద‌ర్శ‌నం ఉంటుందా అని అంద‌రూ ఎదురు చూశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేర‌కు మ‌హిళ‌ల‌కు ఆల‌య ప్ర‌వేశం ఉంటుంద‌ని దేశ‌మంతా భావించింది. కానీ, ఈ ఐదు రోజుల్లో అది సాధ్యం కాలేదు. మొత్తంగా ప‌ది మంది మ‌హిళ‌లు ఆల‌యంలోకి వెళ్లేందుకు తీవ్రంగానే ప్ర‌య‌త్నం చేశారుగానీ, ఎక్క‌డిక‌క్క‌డ వారిని అడ్డుకున్నారు స్వామి భక్తులు. మహిళలు కూడా పట్టు విడవకుండా వస్తూనే ఉండడం కారణంగా ఈ వ్య‌వ‌హారం శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్యగా మారిపోయింది. కోర్టు ఆదేశాల‌ను అమ‌లు చేయ‌డం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించ‌డం, మ‌హిళ‌లు వెళ్ల‌డానికి వీల్లేదంటూ కొన్ని సంఘాలు ఆల‌య పెద్ద‌ల‌తో స‌హా నిర‌స‌న‌లు వ్య‌క్తం చేయ‌డంతోనే ఈ ఐదు రోజులూ ఉత్కంఠ వాతావరణంలోనే గ‌డిచిపోయాయి.

sabari-mala-ladies

ఇప్పుడు ఆల‌య ద్వారాలు మూసుకున్నాయి. అయితే, ఈ ఐదు రోజుల‌కే ప‌రిస్థితి ఇలా ఉంటే ఇక న‌వంబ‌ర్ 16 నుంచి డిసెంబ‌ర్ 28 వ‌ర‌కూ ఆల‌య ద్వారాలు తెరుస్తారు. అంటే దాదాపు న‌ల‌భై రోజుల‌పాటు అప్పుడు ఎలాంటి ప‌రిస్థితులు త‌లెత్తుతాయో అనేదే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. తాజాగా నిషేధాన్ని ఎత్తివేస్తూ ఇచ్చిన తీర్పుపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. కోర్టు ఆదేశాల‌పై ఇప్ప‌టికే 19 రివ్యూ పిటీష‌న్లు దాఖ‌ల‌య్యాయి. మ‌రికొన్ని కూడా దాఖ‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి. వీటిపై విచార‌ణ ఎప్పుడు ఉంటుంద‌నేది ఈరోజు చెబుతామ‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. దీంతో ఈ పిటిష‌న్ల‌పై తీర్పు ఎలా ఉంటుంద‌నే ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది. నిజానికి, సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన వెంట‌నే రివ్యూ పిటీష‌న్ వేసి ఉంటే బాగుండేది. ఆ మేర‌కు ఆల‌య బోర్డు కొంత ఆల‌స్యం చేసింద‌నే చెప్పాలి. రాబోయేది కార్తీక మాసం. అయ్య‌ప్ప మాల‌లు పెద్ద సంఖ్యలో భక్తులు వేయ‌డం ప్రారంభ‌మౌతుంది. శ‌బ‌రిమ‌ల‌కు భ‌క్తుల తాకిడి అనూహ్యంగా ఉంటుంది. ఈ సమయంలో ఇప్పటిలా భక్తులని చెక్ చేసి పంపడం ఆందోళనకారులకి కూడా కష్టం అవుతుంది. దీంతో తాజా నిర్ణ‌యాన్ని ఆర్డినెన్స్ ద్వారా నిలుపుద‌ల చేసే ప్ర‌య‌త్నం ఏమైనా కేంద్ర ప్రభుత్వం చేస్తుందా అనేది అనేది వేచి చూడాలి.

sabarimala