హిందువులు అన్ని విషయాల్లో ఆదర్శంగా శ్రీరాముడిపై కత్తి మహేశ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్వామీజీలు, హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతుండగా కత్తి మహేష్ పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని, అతనిని దేశద్రోహిగా ప్రకటించాలని శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద పాదయాత్రను తలపెట్టారు. అయితే దీనికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో స్వామిజీని వారి ఇంట్లోనే గృహ నిర్బంధం చేశారు. బషీర్‌బాగ్‌లోని భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ధర్మాగ్రహ యాత్రను మొదలుపెట్టాలని భావించారు. అయితే పోలీసులు నిర్బంధించడంతో ఇప్పుడు ప్రారంభం కావాల్సిన యాత్రకు ఆటంకం ఏర్పడింది.
హైదరాబాద్ నుంచి రెండు రోజుల పాటు నడిచి యాదాద్రికి చేరుకుని లక్ష్మీ నరసింహస్వామికి తమ గోడును వెళ్లబోసుకోంటామని పరిపూర్నానంద స్వామి ప్రకటించారు. ‘ధర్మాగ్రహం’ పేరిట యాత్ర జరుగుతుందని, ప్రతి హిందువూ ఇందులో భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. తాను యాదాద్రికి చేరుకునేలోపు కత్తి మహేష్‌పై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకుంటే తన భవిష్యత్తు కార్యాచరణను అక్కడే ప్రకటిస్తానని స్వామిజీ ప్రకటించారు. అయితే ధర్మాగ్రహం పేరిటి స్వామి పరిపూర్ణానంద చేపట్టిన యాత్రకు నటుడు నాగబాబు తాను పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అందుకే స్వామిని నిర్బంధంలోకి తీసుకున్నారని తెలుస్తోంది.