అజ్ఙాతంలోకి చింతమనేని…4 రోజులుగా పోలీసుల గాలింపు 

అజ్ఙాతంలోకి చింతమనేని...4 రోజులుగా పోలీసుల గాలింపు 

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అజ్ఙాతంలోకి వెళ్లిపోయారు. పోలీసుల కంటపడకుండా 4 రోజులుగా తప్పించుకు తిరుగుతున్నారు. పోలీసులు గాలింపు ముమ్మరం చేయడంతో.. జిల్లా ఎస్పీని కలిసి కోర్టులోనే లొంగిపోవాలని భావిస్తున్నట్లు సమాచారం. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని కోసం పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఆయన అనుచరుల ఇళ్లతో పాటు బంధువుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల నుంచి వెతుకుతున్నా…జాడ తెలియలేదు.

దెందులూరుతో పాటు పశ్చిమగోదావరి జిల్లాలో సర్చింగ్‌ ముమ్మరం చేశారు పోలీసులు. చింతమనేనితో పాటు అతని అనుచరుడు గద్దే కిషోర్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో అతన్ని పట్టుకునేందుకు మరో బృందం గాలిస్తోంది. ఇటు చింతమనేని హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. ఏలూరులోని జిల్లా కోర్టులో హజరవుతారనే సమాచారంతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు పోలీసులు. చింతమనేనికి పోలీసులు సహకరిస్తున్నారని పలు సంఘాలు ఆందోళన చేపట్టాయి. కావాలనే +-ఆయన్ని తప్పిస్తున్నారని, ముమ్మాటికీ పోలీసుల వైఫల్యమేనని మండిపడుతున్నారు. గతనెల 29న పెదవేగి మండలం /5పినకడిమిలో అసైన్డ్ భూమిలో ఉన్న ఇసుకను ఇంటి అవసరాల కోసం కొంత మంది తీసుకువెళ్తుండగా వారిని అడ్డుకుని కులం పేరుతో దూషించారనే అభియోగంతో చింతమనేనిపై కేసు నమోదైంది.