దేశ రాజధానిలోని బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద రీతిలో చనిపోయిన కేసును విచారిస్తున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసుల మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు పోలీసు ఉన్నాతాధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కేసును విచారిస్తున్న పోలీసుల్లో చాలామంది తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని మునుపెన్నడు తమ జీవితంలో ఇలాంటి సంఘటనను ఎప్పుడూ చూడలేదని అంటున్నారని ఆత్మల భయంతో చాలా మంది నిద్రలేని రాత్రులు కూడా గడుపుతున్నారని పోలీసులు ప్రకటించారు. ఇప్పటికే 200 మందిని పోలీసులు ప్రశ్నించారు. విచారణ నిమిత్తం పోలీసులు తరచుగా బాటియా ఇంటికి వెళ్తుండటంతో వారు ఒత్తిడికి లోనవుతున్నరని చెప్పుకొచ్చారు.
ఈ కేసు విచారణ వీలైనంత త్వరగా పూర్తయిన వెంటనే ఉద్యోగుల కోసం ఒత్తిడి నివారణ కార్యక్రమాలు నిర్వహించి వారిలో నూతన ఉత్తేజాన్ని నింపేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. కొందరు స్థానికులు పోలీస్ స్టేషన్లో యాగం, శాంతి హోమం వంటి పూజలు చేయమన్నారని ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం కనుక కొంత గడువు ఇవ్వమని కోరామని వారు చెప్పుకొచ్చారు. 15 లక్షల జనాభాతో దాదాపు 30 కిలోమీటర్ల మేర విస్తరించిన బురారీ రక్షణ బాధ్యత పోలీసుల మీద ఉన్నది. అలాగే కుటుంబంలోని ప్రియాంకకు కాబోయే భర్తను ఈ విషయమై పోలీసులు మరోసారి ప్రశ్నించారు. అయితే ఈ కుటుంబానికి ఈ రకమైన సంప్రదాయాలు ఉన్న విషయం తనకు తెలియదని ఆయన పోలీసులకు చెప్పినట్టు సమాచారం. సుమారు మూడు గంటలకు పైగా ఆయనను విచారణ చేసినట్టు తెలుస్తోంది.