ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. హమాస్ సమూల అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతుండగా ఈ దాడుల్లో సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. పౌరులు బలి కావడం పట్ల ప్రపంచ ఆవేదన చెందుతోంది. ఇరు వర్గాలు వీలైనంత త్వరగా ఈ సమస్యకు ఫుల్స్టాప్ పెట్టి దాడులు ఆపాలని కోరుతున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఇజ్రాయెల్-హమాస్ల మధ్య సంఘర్షణపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ప్రధాని మోదీ మాట్లాడారు. వీలైనంత త్వరగా ఈ యుద్ధాన్ని ముగించాలని నెతన్యాహును కోరినట్లు మోదీ తెలిపారు. అలాగే ఎర్ర సముద్రంలో నౌకా ప్రయాణంపై నెలకొన్న భద్రతా పరమైన అంశాన్ని ఆయనతో ఫోన్లో చర్చించినట్టు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా విషయాన్ని ప్రధాని పోస్ట్ చేశారు.
చర్చల్లో భాగంగా బాధిత ప్రజలకు నిరంతర మానవతా సహాయంతో పాటు శాంతి, స్థిరత్వాన్ని ముందస్తుగా పునరుద్ధరించడానికి భారత్ స్థిరమైన వైఖరిని అవలంబిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. చర్చల అంశాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఎక్స్ వేదికగా షేర్ చేశారు.