Political Updates: విశాఖపట్నం జోన్ ఏర్పాటులో రైల్వే శాఖ తాత్సారం

Political Updates: Railway Department's decision on setting up Visakhapatnam zone
Political Updates: Railway Department's decision on setting up Visakhapatnam zone

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో మంత్రిత్వ శాఖ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నట్లు లోక్సభ హామీల కమిటీ ఆక్షేపించింది. మంగళవారం సభకు సమర్పించిన నివేదికలో ఈ విషయంలో రైల్వే శాఖ వైఖరిని తీవ్రంగా తప్పు బట్టింది. దక్షిణకోస్తా రైల్వే జోన్, రాయగడ డివిజన్ ఏర్పాటు గురించి 2020 మార్చి, 2021 ఫిబ్రవరి, మార్చి నెలల్లో లోక్సభలో ఆంధ్రప్రదేశ్ సభ్యులు అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి సమాధానమిస్తూ డీపీఆర్ తయారైందని, అది రైల్వే బోర్డు పరిశీలనలో ఉందని, అందువల్ల నిర్దిష్ట గడువు చెప్పలేమని పేర్కొన్నారు. ఈ హామీ అమలుపై అధ్యయనం చేసిన కమిటీ మూడేళ్లుగా రైల్వే శాఖ వ్యవహారశైలిని తీవ్రంగా తప్పు బట్టింది. ‘‘దక్షిణకోస్తా రైల్వే జోన్, రాయగడ డివిజన్ ఏర్పాటులో తీవ్ర జాప్యం జరిగినట్లు కమిటీ గుర్తించింది. ఈ సమస్య నిరంతరం కొనసాగుతోంది. డీపీఆర్ ఇప్పటికీ ఇంకా రైల్వే మంత్రిత్వ శాఖ పరిశీలనలోనే ఉంది. దాని ఖరారుకు కొంత సమయం పడుతుందన్న విషయాన్ని కమిటీ అర్థం చేసుకుంది.

ఇంత ముఖ్యమైన హామీలో మూడేళ్లకు పైగా జాప్యాన్ని కమిటీ అంగీకరించట్లేదు. అది రైల్వే మంత్రిత్వ శాఖ నిర్లక్ష్యాన్ని చాటుతోంది. వాల్తేరు డివిజన్ మూసివేత గురించి ప్రజాప్రతినిధులతో పాటు, వివిధ భాగస్వామ్య పక్షాలతో చర్చించి సమస్యను పరిష్కరించి ఉండాల్సింది. దీనిపై మంత్రిత్వ శాఖ సమాధానంతో కమిటీ సంతృప్తి చెందడం లేదు. రైల్వే జోన్ అంశాన్ని పార్టీలతో సంబంధం లేకుండా సభ్యులంతా సభలోనూ, బయట ప్రస్తావిస్తున్నారు. మౌలికవసతుల పనులు నిర్దిష్ట గడువులోగా పూర్తిచేయడం కష్టమని కమిటీకి తెలుసు. ఇదే సమయంలో హామీలు నెరవేర్చడానికి రైల్వే శాఖ ప్రయత్నాలు చేయలేదన్నది నిజం. ఇప్పటికైనా రైల్వే శాఖ అన్ని పక్షాలతో సమన్వయం చేసుకొని, హామీల అమలుకు నడుం బిగించాలి. రాయగడ డివిజన్ ఏర్పాటుతో ఆ జిల్లాలో పారిశ్రామిక, సామాజిక, ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. అందువల్ల రైల్వే శాఖ వెంటనే దక్షిణకోస్తా రైల్వే జోన్, రాయగడ డివిజన్ ఏర్పాటుకు నిర్దిష్ట గడువుతో కూడిన కార్యాచరణను తయారుచేసి అమలుచేయాలి’’ అని కమిటీ తన నివేదికలో పేర్కొంది.