Politics: మూడు నేర న్యాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

Politics: President approves three criminal justice bills
Politics: President approves three criminal justice bills

పార్లమెంట్ ఆమోదించిన మూడు నేర న్యాయ బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులకు ఆమోద ముద్ర వేశారు. దీంతో IPC, CRPC స్థానంలో భారతీయ చట్టాలు వచ్చినట్లైంది.

ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్పీసీ), ఎవిడెన్స్ యాక్ట్లకు ప్రత్యామ్నాయంగా ఈ మూడు బిల్లులను కేంద్ర ప్రభుత్వం వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. వీటిపై హోంశాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పలు సూచనలు చేయగా బిల్లులను కేంద్రం వెనక్కి తీసుకుని కొన్ని సవరణలు చేసి శీతాకాల సమావేశాల్లో సభ ముందుకు తెచ్చింది. ఈ బిల్లులను గతవారం పార్లమెంట్ ఆమోదించి పంపగా తాజాగా రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.

ఈ చట్టాల్లో ప్రతి నేరానికి సంబంధించిన నిర్వచనం, వాటికి విధించే శిక్షల గురించి వివరంగా ప్రస్తావించారు. తొలిసారి ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వడమే కాకుండా దోషులకు శిక్షలు విధించే విషయంలో మేజిస్ట్రేట్లకు ఉన్న అధికారాలను కొత్త చట్టాల్లో పెంచారు. నేరస్థుడిగా ప్రకటించే విషయంలో వారికి ఉన్న పరిధిని విస్తృతం చేశారు. దేశంలోని న్యాయ వ్యవస్థను ఈ మూడు చట్టాలు పూర్తిగా మార్చేయనున్నాయి.