ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల దరఖాస్తు పత్రాన్ని విడుదల చేశారు. డాక్టర్ B.Rఅంబేద్కర్ సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా లోగో రివీల్ చేశారు. రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన ప్రారంభం కానుంది. రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఆరు గ్యారంటీల దరఖాస్తు పత్రాలను ప్రజాప్రతినిధులు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. నిస్సహాయులకు సహాయం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పట్టణాల నుంచి తండాల వరకు అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు.అందరూ హైదరాబాద్ లోని సచివాలయానికి వచ్చి వినతులు సమర్పించడం కష్టతరంగా మారుతుందని భావించి.. గ్రామంలోనే దరఖాస్తుల స్వీకరణ చేపడుతున్నామని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది రోజులపాటు దరఖాస్తులను స్వీకరించనున్నామని తెలిపారు. ప్రజలను ప్రభుత్వం దగ్గరకు వినిపించుకోకుండా, ప్రభుత్వాన్నే ప్రజల దగ్గరకు చేర్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. పగడ్బందీగా ఈ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. ప్రభుత్వంలోకి వచ్చిన రెండు రోజులకే రెండు గ్యారెంటీలను అమలు చేశామని, మిగతా నాలుగు గ్యారంటీల అమలు కోసమే ఈ దరఖాస్తులు స్వీకరిస్తున్నామని చెప్పారు. అర్హులైన పేదలందరికీ ఈ ప్రభుత్వంలో తప్పకుండా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ వారం రోజుల్లోనే దరఖాస్తు చేయాల్సిన తప్పనిసరి నిబంధన ఏం లేదని, అనుకూలమైన సమయంలో దగ్గరలోని ప్రభుత్వ కార్యాలయంలో ఎప్పుడైనా దరఖాస్తు సమర్పించవచ్చని తెలిపారు.