యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అప్పటివరకు మాస్ సినిమా చేసాడు, కామెడీ పండించాడు, రకరకాల ప్రయత్నాలు చేసాడు కానీ ప్రభాస్ కు విజయం మాత్రం అందని ద్రాక్షలానే ఉంది. అలాంటి సమయంలో ప్రభాస్ చేసిన డార్లింగ్ అతన్ని తన అభిమానులకు ఏకంగా డార్లింగ్ ను చేసేసింది. అప్పటినుండి ప్రభాస్ ను అభిమానులు, అభిమానులను ప్రభాస్ డార్లింగ్ అని పిలుచుకోవడం చాలా ఫ్యాషన్ గా మారిపోయింది. అదో స్పెషల్.. అంతకంటే క్రేజిగా, ట్రెండీగా అయిపోయింది. డార్లింగ్ తో ఐదేళ్ల తర్వాత హిట్ కొట్టిన ప్రభాస్ స్టార్ హీరోల రేంజ్ కు ఈ సినిమాతోనే దగ్గరయ్యాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
అయితే తొలిప్రేమ వంటి లవ్ స్టోరీస్, ఉల్లాసంగా ఉత్సాహంగా వంటి ఎంటర్టైనర్ ను అందించిన దర్శకుడు సినిమా అందులోనూ పెద్దహీరోతో అంటే అంచనాలు బాగానే ఉంటాయి. ప్రేక్షకులు కూడా ప్రభాస్ డార్లింగ్ మరో అద్భుతం అంటూ ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ సినిమా చివరికి ఫ్యాన్స్ కు మాత్రమే తీసినట్లుగా అనిపించేసింది. సినిమా పరంగా కొత్తగా ఏం లేకపోయినా… ఈ సినిమా గొప్పతనం ఏమిటంటే.. ప్రభాస్ కొత్తగా కనపించడం. అతని డ్రెస్ సెన్స్, స్టైల్స్ ప్రేక్షకులను మంత్రుముగ్దులను చేస్తాయి. ఒక్కముక్కలో చెప్పాలంటే.. ప్రభాస్ అభిమానులకు సంతృప్తి పరచటానికి చేసిన సినిమాగా తెలిసిపోయింది.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ఎ. కరుణాకరన్ డైరెక్టర్ గా, బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించిన రొమాంటిక్ డ్రామా డార్లింగ్. ప్రభాస్ కు జంటగా కాజల్ అగర్వాల్ నటించిన ఈ సినిమాకి ఎ.ఆర్. హెహ్మాన్ మేనల్లుడైన జి. వి. ప్రకాష్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా 2010 ఏప్రిల్ 23న విడుదలైంది. అయితే ఈ సినిమాకి ఒక గొప్ప అవకాశం లభించింది. అదేమంటే.. 2010లో తెలుగు సినీపరిశ్రమలోని అతి పెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. కాగా ఈ సినిమాలో ముఖేష్ రుషి చేసిన పాత్రకు డబ్బింగ్ చెప్పిన ఆర్.సి.యం రాజుకు 2011లో నంది ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది అవార్డు రావడం విశేషం. మొత్తానికి డార్లింగ్ సినిమా విడుదలై ఈరోజుకి కరెక్ట్ గా పదేళ్లు. ఇక్కడో విషయం చెప్పాలి. ప్రభాస్ కి వ్యక్తిగతంగా ప్రేక్షకుల్లోనూ హీరో స్థాయి తాలూకూ ఇమేజ్ ‘డార్లింగ్ మూవీకి ముందు డార్లింగ్ మూవీకి తర్వాత’ అన్నట్లుగా ప్రభాస్ పేరు ప్రపంచాన్ని విస్తరించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.