చెన్నైలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రహరీ గోడ కూలిపడి తండ్రీ ఇద్దరు కుమార్తెలు దుర్మరణం చెందారు. చెన్నై సమీపంలోని తాంబరం పీక్కన్ కరణై సమీపంలో ఘటన జరగడంతో అక్కడ విషాద చాయలు అలముకున్నాయి. అలాగే.. వేసవి కావడంతో చల్లగాలి కోసం బయట కూర్చున్న కుటుంబం ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోయింది.
అయితే ఇంటి పక్కనున్న ఖాళీ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రహరీ గోడ కూలిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో తండ్రి, ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోయారు. పీక్కన్ కరణై ముత్తమిళ్ వీధి శ్రీనివాస నగర్‌కు చెందిన రాజాంగం పెయింటర్, ఆయన కుమార్తెలు కళ, సుమిత్రతో మంచంపై కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ ఖాళీ ప్రదేశం చుట్టూ గోడ ఉంది. చాలా ఏళ్ల క్రితమే నిర్మించిన గోడ కావడంతో అది కూలి ఒక్కసారిగా మంచంపై పడింది. శిథిలాల కింద ఆ ముగ్గురు చిక్కుకోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని ముగ్గురిని శిథిలాల నుంచి వెలికి తీశారు. 108 అంబులెన్స్‌లో క్రోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే రాజాంగం ప్రాణాలు కోల్పోగా.. కళ, సుమిత్ర చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.