Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పగటి కలలు కనడంపై భారతదేశంలో ఎలాంటి నిషేధం లేదంటున్నారు బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్. ప్రధాని పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఆయన ఇలా వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. దేశంలో కాంగ్రెస్ 20 రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిందని, ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉందని, కానీ రాహుల్ గాంధీ మాత్రం దేశానికి ప్రధాని కావాలని ఆలోచిస్తున్నారని విమర్శించారు. అయితే ఈ దేశంలో పగటి కలలు కనడంపై ఎలాంటి నిషేధం లేదని జవదేకర్ ఎద్దేవా చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీకి రాహుల్ గాంధీ పోటీ ఇస్తారా….అని జవదేకర్ ను మీడియా ప్రశ్నించగా…ఓ స్మార్ట్ ట్వీట్ లేదా పెద్ద చర్చ రాజకీయం కాదు.
రాజకీయం అంటే అంతకంటే ఎక్కువ అని జవదేకర్ సమాధానమిచ్చారు. కర్నాటకలో జేడీఎస్ తో కలిసి బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకున్న కాంగ్రెస్ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి ఫార్ములాలే అనుసరించాలని భావిస్తోంది. బీజేపీని నిలువరించేందుకు ఎక్కడికక్కడ స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుని పునర్ వైభవం సాధించాలన్నది ప్రస్తుతం కాంగ్రెస్ వ్యూహం. అయితే కర్నాటకలో ఎదురయిన పరాభవం సార్వత్రిక ఎన్నికల్లో జరగకూడదన్న ఉద్దేశంలో ఉన్న బీజేపీ ఇప్పటినుంచే అందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.