Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కమల్ హాసన్ తర్వాత విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల కేంద్రప్రభుత్వాన్ని, మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి కురిపిస్తున్నారు. జర్నలిస్టు గౌరీలంకేశ్ హత్య కేసులో మోడీ వైఖరిని తప్పుబట్టిన ప్రకాశ్ రాజ్ తాజ్ మహల్ వివాదంపైనా కేంద్ర, యూపీ ప్రభుత్వాల తీరును ప్రశ్నించారు. తాజ్ మహల్ ను ఎప్పుడు కూల్చివేస్తారో చెబితే తన పిల్లలకు ఆఖరిసారిగా ఆ కట్టడాన్ని చూపెడతానని ఇటీవల వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. తాజాగా మరోమారు ప్రకాశ్ రాజ్ హిందూ సంస్థలపై వ్యతిరేకత ప్రదర్శించారు. దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోయిందని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ స్పందించారు. కమల్ వ్యాఖ్యలను సమర్థించిన ప్రకాశ్ రాజ్ కొన్ని ఉదాహరణలు చెబుతూ హిందూ సంస్థల తీరును తీవ్రంగా తప్పుబట్టారు.
మతం, సంప్రదాయం పేర్లతో ప్రజల్లో భయాన్ని పుట్టించడం హిందూ ఉగ్రవాదం కాక మరేమిటని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. నాకు తెలియక అడుగుతున్నాను సమాధానం చెప్పండి అంటూ కొన్ని ప్రశ్నలు వేశారు. నైతికత పేరుతో దేశంలోని ప్రేమజంటలపై దాడిచేయడం ఉగ్రవాదం కాదా..? గోరక్షకుల పేర్లతో దాడులకు పాల్పడుతూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం హిందూ ఉగ్రవాదం కిందకు రాదా అని ప్రశ్నించారు. కమల్ హాసన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన బీజేపీ..ఆయనపై కేసు వేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్న నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ఆ వ్యాఖ్యలను సమర్థించడం తమిళనాట చర్చనీయాంశమయింది. ప్రకాశ్ రాజ్ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలను పరిశీలిస్తే…ఆయన రాజకీయాల్లోకి రావొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమిళనాడులో కమల్ హాసన్ పెట్టబోయే కొత్త పార్టీలో ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన ఇటీవల కమల్ మాదిరిగానే….కేంద్రప్రభుత్ వంపైనా, మోడీపైనా వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.