Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
-
ఏపీలో రూ. 149కే నెట్, టీవీ, ఫోన్
-
ఫైబర్ నెట్ ప్రాజెక్టు ప్రారంభించిన రాష్ట్రపతి
డిజిటల్ రంగంలో ఆంధ్రప్రదేశ్ కొత్త శకంలోకి అడుగుపెట్టింది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టును రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అమరావతిలో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రూ. 149కే ఒకే కనెక్షన్ తో నెట్, టీవీ, ఫోన్ అందించనుంది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై రాష్ట్రపతి ప్రశంసల జల్లు కురిపించారు. ఫైబర్ నెట్, రియల్ టైమ్ గవర్నెన్స్ వంటి వినూత్న విధానాలు చేపట్టడం ద్వారా టెక్నాలజీ ఇంటిగ్రేషన్ తో సాంకేతిక రంగంలో ఏపీ ఎంతో అభివృద్ధి సాధిస్తోందని కొనియాడారు. దేశమంతటికీ ఇవి ఉపయోగపడే రీతిలో జాతీయస్థాయిలో ప్రజెంటేషన్ ఇవ్వాలని సూచించారు. గుంటూరులోని ఏఎన్ యూలో ఏర్పాటుచేసిన భారత ఆర్థిక సంఘం సదస్సును కూడా రాష్ట్రపతి ప్రారంభించారు.
ఐఏఈ వందో వార్షికోత్సవ సదస్సులో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అర్ధశాస్త్రం నదీ ప్రవాహం లాంటిదని, ఎన్నో శాస్త్రాలను తనలో ఇముడ్చుకుందని అభివర్ణించారు. ఆర్థికవేత్తలు సమిష్టిగా ఆలోచనలు చేసి సూచనలు ఇవ్వాలన్నారు. మానవసమాజం కీలకమైన మలుపులో ఉందని అంతర్జాతీయ వాణిజ్యాన్ని పెంచుకునేలా మరిన్ని సంస్కరణలు రావాలని కోవింద్ ఆకాంక్షించారు. అటు రాష్ట్రపతి అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటే ఆయన భార్య, కుమార్తె విజయవాడలో సందడి చేశారు. స్వరాజ్య మైదానంలో ఏర్పాటుచేసిన పుష్పప్రదర్శనను తిలకించారు. అనంతరం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత భవానీ ఐలాండ్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బోటులో కృష్టానదిలో విహరించారు.