Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కథువా దారుణ అత్యాచారఘటనపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ అత్యాచారం పట్ల అందరూ సిగ్గుపడాలని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. కత్రాలో జరిగిన శ్రీమాతా వైష్ణోదేవి విశ్వవిద్యాలయం ఆరో స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా చిన్నారులపై ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటే మన సమాజం ఎటుపోతోందో ఆలోచించుకోవాలన్నారు. స్త్రీలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కథువాలాంటి అఘాయిత్యాలు ఇకపై ఎక్కడా జరగకుండా చూసుకోవాలని కోరారు.
చిన్నారులపై ఇటీవల జరుగుతున్న దారుణాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఆడపిల్లలకు ఒంటరిగా తిరిగే స్వేచ్ఛనిచ్చి, ఇప్పుడు వాళ్లపై పైశాచికం చూపడం అత్యంత దారుణమైన చర్య అని, దీనికి చరమగీతం పాడాలని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కథువా ఘటనపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. చిన్నారుల పట్ల అంత కర్కశంగా ఎలా ప్రవర్తించగలరు? పిల్లలు సాక్షాత్తూ వైష్ణోదేవి ప్రతిరూపాలు. ఇలాంటి పసిమొగ్గలపై ప్రతాపం చూపడం ఎంతమాత్రం సరికాదు అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.