Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వరుస క్షిపణిలతో బెంబేలెత్తిస్తున్న ఉత్తరకొరియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిప్పులు చెరిగారు. ఐక్యరాజ్యసమితి వేదికగా తొలిసారి ప్రసంగించిన ట్రంప్ ఉత్తరకొరియాపైనే ప్రధానంగా దృష్టిపెట్టారు. క్షిపణి ప్రయోగాలు జరపకుండా ఉత్తరకొరియాపై తీవ్ర ఒత్తిడి తీసుకురావాలని ఆయన ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఆ దేశ ఆగడాలు అడ్డుకునేందుకు ఆసియా దేశాలు కూడా కలిసి రావాలని ఆయన కోరారు. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, వెనెజులా సంక్షోభం, ఐసిస్ ఉగ్రవాద చర్యలను కూడా ట్రంప్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఉత్తరకొరియా, ఇరాన్ నేతలతో చర్చలు జరపాలని ప్రపంచ దేశాధినేతలకు ట్రంప్ విజ్ఞప్తి చేశారు.
పలు దేశాల్లో మారణ హోమం సృష్టిస్తున్న ఐసిస్ ఉగ్రవాదులను ఓడిపోయినవారుగా ట్రంప్ అభివర్ణించారు. ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని నెలలకే ఉత్తరకొరియా రూపంలో ఆయనకు సమస్య ఎదురయింది. అమెరికాకు ఆజన్మ శత్రువైన ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలతో అంతర్జాతీయంగా టెన్షన్ పెంచుతోంది. అమెరికా భూభాగమైన గువామ్ పై క్షిపణి దాడిచేస్తామని ఉత్తరకొరియా హెచ్చరించడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక దశలో యుద్ధం ముంచుకొస్తున్న ముప్పు కనిపించింది. అయితే తర్వాత ఉద్రిక్తత కొంత చల్లారినా… ఇరు దేశాలు హెచ్చరికలు చేసుకుంటూనే ఉన్నాయి. ఉత్తరకొరియా తీరుకు వ్యతిరేకంగా భద్రతామండలి ఆ దేశంపై కఠిన ఆంక్షలు విధించేలా అమెరికా పావులు కదిపింది. అయినా ఉత్తరకొరియా వెనక్కి తగ్గటం లేదు. మీ ఆంక్షలు మమ్మల్ని ఏం చేయలేవంటూ… క్షిపణి ప్రయోగాలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యలో ఐక్యరాజ్యసమతిలో ప్రసంగించిన ట్రంప్ ఉత్తరకొరియా సమస్యపైనే ప్రధానంగా ఫోకస్ చేశారు.