రజనీకి ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ ఆఫ్ ఇఫి పురస్కారం

రజనీకి ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ ఆఫ్ ఇఫి పురస్కారం

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కేంద్ర ప్రభుత్వం అరుదైన ఘనతతో గౌరవించనుంది. గోవాలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా రజనీకి ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ ఆఫ్ ఇఫి పురస్కారాన్ని కట్టబెట్టనుంది. భారతీయ సినిమాకు దశాబ్దాలుగా చేస్తున్న సేవను పురస్కరించుకుని రజనీకి ఈ పురస్కారం అందచేస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ శనివారం ప్రకటించాడు.

ఏటా గోవాలో నిర్వహించే ఇఫి వేడుకకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. ఇండియా అధికారికంగా ఏటా నిర్వహించే ఫిలిం ఫెస్టివల్ ఇది. దేశంలో ఏడాది కాలంలో వచ్చిన అత్యుత్తమ చిత్రాల్ని ఎంపిక చేసి  వాటితో పాటు వివిధ దేశాల నుంచి వచ్చి అత్యుత్తమ చిత్రాల్ని ఇక్కడ ప్రదర్శిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఫిలిం ఫెస్టివల్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది.

ఈ ఫిలిం ఫెస్టివల్‌కు 50 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో రజనీని ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ ఆఫ్ ఇఫి పురస్కారంతో గౌరవించడం అంటే గొప్ప విషయమే. ఇండియాలో ఎందరో లెజెండ్స్ ఉండగా రజనీని ఈ గౌరవానికి ఎంపిక చేయడం దక్షిణాది సినిమాకు దక్కిన గౌరవంగా చెప్పొచ్చు. దీని వెనుక రాజకీయ కారణాలు కూడా ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎలాగైనా రజనీని తమ పార్టీలోకి లాగాలని ఎప్పట్నుంచో చూస్తున్న భారతీయ జనతా పార్టీ ఈ పురస్కారం రూపంలో చిన్న వల వేసినట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ తమిళ జనాలు మాత్రం రజనీకి ఈ పురస్కారం దక్కడం పట్ల అమితానందం ప్రకటిస్తున్నారు. ట్విట్టర్లో ఈ వార్త బయటికి వచ్చిన కొన్ని నిమిషాల్లోనే ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది.